స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 11 : జిల్లాకు సంబంధించి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్తో కలిసి అధికారులు,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఎస్.ఆర్.-2025 ఫొటో ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా జిల్లాకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేని జాబితా రూపొందించేందుకు అధికారులు,రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఆగస్టు 20 నుండి అక్టోబర్ నెల 18వ తేదీ వరకు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం 50 శాతం పూర్తయిందని తెలిపారు.భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 2, 3 ఎపిక్ కార్డులు ఉన్న వారి వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఒకే కుటుంబానికి చెందిన వారందరు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందించాలని తెలిపారు. మరణించిన వారి వివరాలు జాబితా నుండి తొలగించేందుకు నిబంధనల మేరకు నోటీసులు జారీ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ,జాబితాలో నాణ్యత గల ఫొటోలను నమోదు చేయడం,పోలింగ్ కేంద్రాలలో సెక్షన్,పార్ట్ నంబర్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసే ప్రాంతాల అనుమతులు పొందాలని తెలిపారు. అక్టోబర్ 19 నుండి 28వ తేదీ వరకు నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కొరకు ఫారం 1 నుండి 8 వరకు అందిన దరఖాస్తులు పరిశీలించి ముసాయిదా జాబితా తయారు చేసి అక్టోబర్ 29వ తేదీ వరకు ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి జరుగుతుందని, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.డిసెంబర్ 24వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని,జనవరి 1, 2025న తుది జాబితా ప్రచురణ కొరకు పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి నివేదించి అనుమతి పొందిన అనంతరం జనవరి 6, 2025వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.నూతన ఓటరు నమోదు కొరకు జనవరి 1, ఏప్రిల్ 1,జూలై 1,అక్టోబర్ 1 లను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని,జనవరి 1, 2025 నాటికి 18 సం||ల వయస్సు నిండే వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల 22 వేల 103 మంది పురుషులు, 3 లక్షల 28 వేల 549 మంది మహిళలు,45 మంది ఇతరులు, 39 మంది ఎన్.ఆర్.ఐ.లు,677 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ చొప్పున నియమించి ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో బూత్ స్థాయి అధికారులకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking