రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు.గురువారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు-కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో ఓటర్ల జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ లోగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు తమ జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశం తీరు తెలిసేలా వీడియో,ఫొటోలు కవరేజ్ చేయాలని,రిజిస్టర్లు నిర్వహించాలని,మినిట్స్ ఆఫ్ మీటింగ్ సి.ఈ.ఓ. రాష్ట్ర వెబ్సైట్లో నమోదు చేయాలని తెలిపారు. పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితా సంబంధిత దరఖాస్తు ఫారాలు 6,7,8 లపై వివరించాలని,నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించడంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ నెల 21వ తేదీలోగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ…జిల్లాలో స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 15వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, మినిట్స్ ఆఫ్ మీటింగ్ పూర్తి వివరాలు ఫొటోలు, వీడియోలతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో 1 వేయి 470 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని,2, 3 రోజులలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రామారావు,హరికృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారి కె.వై.ప్రసాద్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.