సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 09:
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,జి.హెచ్.ఎం.సి.కమీషనర్ ఇలంబర్తి, ప్రణాళిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నారు.సామాజిక, ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ,కుల సర్వేలో రాష్ట్రంలోని అన్ని కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగలు,ఇతర బలహీన,అన్ని వర్గాల అభ్యున్నతికి సరైన నిర్ణయాలు తీసుకొని అవసరమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేందుకు సర్వే చేపట్టబడుతుందని తెలిపారు.జిల్లాలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ప్రతి జిల్లాలో ఇండ్ల జాబితాల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లో కేటాయించిన ప్రకారం సర్వే నిర్వహించాలని,ప్రతి 10 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లకు డాటా సేకరణ పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్‌ను
నియమించడం జరుగుతుందని, ఎన్యుమరేటర్‌ సేకరించిన వివరాలలో 10 శాతం రాండమ్‌ కుటుంబాలను ఎంపిక చేసుకొని ఆ ఇండ్లను సూపర్‌వైజర్లు సందర్శించి వివరాలను పున: పరిశీలించాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు సర్వేకు అవసరమైన ప్రతి సామాగ్రిని సమకూర్చాలని,సర్వే వారంలో కుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.జిల్లాలో ఏర్పాటుచేసిన సర్వే బృందాలకు సిపిఓ నోడల్ అధికారిగా వ్యవహరించాలని, మైనర్ సమస్యలు జిల్లా,రాష్ట్రస్థాయికి తెలియజేయాలని తెలిపారు.వివరాల సేకరణలో గోప్యత, నైతిక ప్రమాణాలు పాటించాలని, కేటాయించిన బ్లాక్‌లో అన్ని కుటుంబాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, సర్వే సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆధార్‌ కార్డు రేషన్‌ కార్డు అందుబాటులో ఉంచుకునేలా తెలియజేయాలని, ఇంటి నంబర్‌, ఇంటి యజమాని పేరు ఇతర వివరాలు సేకరించిన అనంతరం స్టిక్కర్‌ను అట్టి ఇంటి గోడపై అతికించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు అధికారులకు మార్గనిర్దేశం చేయాలని, పర్యవేక్షకులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు మార్గదర్శకాలను అనుసరించి సర్వే నిర్వహించాలని, సర్వే ఉద్దేశ్యం ప్రజలకు అవగాహన కల్పించాలని, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షించి అవసరమైన సహాయాన్ని అందించాలని తెలిపారు.సర్వే ప్రక్రియ ఉద్దేశం ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రింట్,ఎలక్ట్రానిక్, కేబుల్ మీడియాల ద్వారా ప్రజలకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.సర్వే గురించి ప్రజలందరికీ తెలిసే విధంగా హోర్డింగులు ఏర్పాటు చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి అధికారులతో సర్వే ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని,జిల్లాలోని ప్రతి ఇంటి నుండి కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.సర్వే ప్రక్రియలో ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి అయినందున ఎన్యుమరేటర్లకు సర్వే ఫారములు కొరత లేకుండా అందజేయాలని,డాటా ఎంట్రీ కేంద్రాలు పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంగన్వాడి,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని,సూపర్వైజర్లు,పర్యవేక్షకులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేలా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking