తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్
మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ .
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్:-
సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వృత్తి, ఉపాధి, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా “సమగ్ర ఇంటింటి సర్వే”ను చేపట్టినందుకు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చి ప్రజాపాలనలో భాగంగా సర్వేకు స్ఫూర్తినిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మరియు ఇతర పెద్దలకు, డెడికేటివ్ కమిటీ పెద్దలకు, ఆ కమిటీ వేయడానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జ్యోతి కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ ప్రజల స్థితిగతులను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే ప్రజలకు అవసరమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని చేపట్టవచ్చనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈనెల ఆరవ తేదీన చేపట్టిన సర్వేకు ప్రతి ఒక్కరూ విధిగా సమాచారం అందించి, సర్వేను విజయవంతం చేయవలసిందిగా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ కోరారు. సరైన సమాచారం ఇవ్వడం వల్ల సరైన ప్రణాళికలకు అవకాశం కలుగుతుందని, సర్వే చేసేవారు సమాచారాన్ని జాగ్రత్తగా సేకరించాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఎవరూ బహిరంగంగా వెల్లడించరు కనుక అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, దాట వేయవద్దని తెలిపారు. సర్వే సిబ్బందికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు చేయడానికి అన్ని స్థాయిల అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా ఎలాంటి సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని జ్యోతి కృష్ణ కోరారు. 15 రోజులపాటు జరిగే ఈ సర్వేకు సర్వే సిబ్బంది ఇంటికే వస్తారు కనుక ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారు తెలిపారు. మీ ఇంటికి వచ్చే సర్వే సిబ్బందికి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలు తగిన విధంగా సహకారం అందించి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న “ప్రయోజనకరమైన సర్వే”ను విజయవంతం చేయాలని వారు కోరారు.