ఉద్యమకారుల కార్యచరణ పై సుదీర్ఘ చర్చ
అడ్ హక్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ చెరుకు సుధాకర్
త్వరలో నిర్ణయాలు: మొహమ్మద్ హఫీజ్ మోల్సాబ్
మెదక్/ హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ఉద్యమకారుల సమావేశం హైదరాబాద్ లోని సీనియర్ కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఇంట్లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఎమ్మెల్సీ రామలు నాయక్, గోమాస, డాక్టర్ రియాజ్, రియాజ్ అహ్మద్, ధనలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్ మొల్సాబ్ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్లో ఉద్యమకారుల భవిష్యత్ పై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ భవిష్యత్ కోసం తమ భవిష్యత్తును ఫణంగా పెట్టిన ఉద్యమకారులను గుర్తించాలన్న ఏకైక ఎజెండాతో చర్చలు సాగాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి జనంలో క్రేజ్ పెరిగిందని, దానిని ఓటు రూపంలో మార్చేందుకు ఏం చేయాలని అంశంపై కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమకారుల అడ్ హక్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ చెరుకు సుధాకర్ ను ఎన్నుకున్నారు. త్వరలో తమ కార్యచరణ పట్టిస్తామని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ మీడియాకు తెలిపారు.