జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావాత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు :19
ఒక్క చిత్రం మానవ జీవితంలో అనేక జ్ఞాపకాలను భద్రపరిచి,గుర్తు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావాత్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో లయన్స్ క్లబ్-మంచిర్యాల, లయన్స్ క్లబ్-గోల్డెన్ జూబ్లీ,లయన్స్ క్లబ్-హైటెక్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… కెమెరా ద్వారా బంధించిన ఒక్క చిత్రం మానవ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని,ఎన్నో సంతోషాలను తిరిగి ఇస్తుందని అన్నారు. 18వ శతాబ్దంలో నలుపు,తెలుపు రంగులతో ప్రారంభమైన చిత్రాలు (ఫోటోలు) నేడు ఎన్నో రంగులతో మరిన్ని జ్ఞాపకాలను బంధించి భద్రపరుస్తున్నాయని అన్నారు. ఫోటోగ్రఫీలో ఫోటోలు తీయడం అద్భుతమైన కళ అని, ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యంతో చిత్రీకరించి మానవ జీవితంలో సంతోషకరమైన ఘటనలను భద్రపరచుకునేలా అందిస్తారని అన్నారు. ఈ క్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు మంత్రి సునీల్ కుమార్,మాదర బోయిన శ్రీనివాస్, బెక్కం సదానందం లను శాలువా, మెమొంటోలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్బుల ప్రతినిధులు రాకేష్ రెడ్డి,విశ్వనాధ్, మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, చంద్రమౌళి,కొత్త సురేందర్, హనుమంతరావు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.