ప్రయాణికులు ఫుల్.. ఆర్టీసీ ఆదాయం నిల్..!

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో పెరిగిన ప్రయాణికుల రద్దీ

సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి

బస్సులకు తరచూ రిపేర్లు

అయినా ఆదాయం అంతంత మాత్రమే

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి
19 ఆగస్టు 2024 :

రాష్ట్ర ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి రుసుం చెల్లించకుండా రాష్ట్రంలో ఎక్కడికై నా ఉచిత ప్రయాణం కొనసాగించే అవకాశం కల్పించింది. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ.. ఆర్టీసీకి ఆదాయం తగ్గింది. అంతేకాకుండా డబుల్‌ డ్యూటీల కారణంగా ఆర్టీసీ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ట్రిప్పుల సంఖ్య పెరగడంతో బస్సులకు తరచూ రిపేర్లు అవుతున్నాయి.
మెదక్‌ రీజియన్‌ పరిధిలో నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ డిపోలు ఉన్నాయి. ఈ 8 డిపోల్లో 593 బస్సు సర్వీసులు ఉండగా అందులో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 147, పల్లెవెలుగు 389, లగ్జరీ, సూపర్‌లగ్జరీ బస్సులు 57 కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ బస్సుల్లో సగటున 2.40లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 1.50లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు ముందు నిత్యం సగటున ప్రయాణికులు 1.70లక్షలు మాత్రమే ప్రయాణించేవారు. 8 డిపోల పరిధిలోని బస్సులు నిత్యం 2.05 లక్షల కిలోమీటర్ల మేర నడిపించేవారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి ముందు నిత్యం ఆదాయం రూ.94.55లక్షలు. ఇప్పుడు రూ.1.29కోట్లకు చేరింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) గతంలో 74.09 ఉండగా ఇప్పుడది 105.92కి పెరిగింది. అయితే బస్సుల్లో టికెట్ల ద్వారా వచ్చే నగదు తగ్గిపోయింది. కేవలం ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ పెరిగింది.
ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పని ఒత్తిడి

బస్సుల్లో రద్దీ పెరగడంతో ట్రిప్పుల సంఖ్య కూడా పెంచారు. దీంతో ఆర్టీసీ సిబ్బందికి డబుల్‌ డ్యూటీలు, ఓవర్‌ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ఇందుకనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా కొందరు అనారోగ్యాల పాలవుతున్నారు.
ఇవీ నిత్య కష్టాలు..

ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సర్వీ సులు, కార్మికుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సైతం సంస్థ మనుగడుకు వెనువెంటనే రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని కార్మికుల వర్గం కోరుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking