వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ప్రభుత్వాన్ని కోరిన ఎస్టియు నేతలు
జగిత్యాల, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో పనిచేస్తున్న
ఐదు లక్షల పైబడి ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర రాజధానిలో అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచాలని స్టేట్ ఎస్టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ లు ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం స్థానిక విద్యానగర్ లోనీ ఎస్టియు భవన్ లో జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్ అధ్యక్షతన జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరుగగా
ముఖ్య అతిథిగా
రాష్ట్ర కార్యదర్శి సీర్ణంచ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్,
ప్రధాన కార్యదర్శి బైరం హరికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రధాన భాగమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైనా దీర్ఘకాలిక, అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఈ.హెచ్.ఎస్ పథకం పూర్తిగా ఫెయిల్ అయిందని అలాగే
మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యంలో 20 ఏళ్ల క్రితం మెడికల్ బోర్డు రూపొందించిన ఖర్చుల పట్టికనే ఇంకా పరిగణనలోకి తీసుకుంటూ ఉద్యోగికి వైద్య ఖర్చులు చెల్లిస్తున్నారని ఇది ఎంత మాత్రం సరిపోవడం లేదన్నారు. సింగరేణి కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నట్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా పాత పది జిల్లాల కేంద్రాల్లో ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు , పిఆర్సి బకాయిలు ఈ ఫిబ్రవరి మాసంలోనే చెల్లించాలని కోరారు. ఈ వేసవి సెలవుల్లోనే నిలిచి పోయిన బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండి శ్రీనివాస్, మేకల ప్రవీణ్, శివ రామకృష్ణ, గంగాధర్, తిరుపతి రెడ్డి, నరేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.