పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..గురువారం పట్టణంలోని టీఎన్జీవోస్ హాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లాలో ఈ నెల ఒకటి నుండి 30 వరకు నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసంలో సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పోషణ, పోషకాహారం, శుద్ధమైన త్రాగునీరు, పరిశుభ్రతపై వివరించాలన్నారు. జిల్లాలోని 926 అంగన్వాడి కేంద్రాలలో పోషణ అభియాన్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని, తల్లి, బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.ప్రతిరోజు గర్భిణీలకు, బాలింతలు, పిల్లలకు పాలు,గుడ్లు, పోషక విలువలు కలిగిన హారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి,ఆశ,వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పోషణ,ఆరోగ్య శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.పోషణ లోపం కలిగిన పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ప్రతి చిన్నారి వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పోషక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,ఇంచార్జి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అంగన్వాడి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళా,శిశు సంక్షేమం,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ తల్లి బిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలలో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, అంగన్వాడి,వైద్య శాఖ సిబ్బందిచే కలెక్టర్ పోషణ అభియాన్ కార్యక్రమం అమలుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు వివిధ అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ప్రదర్శించిన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగలక్ష్మి, వైద్యులు నయన రెడ్డి,సౌమ్య, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అధికారులు, కౌన్సిలర్లు,అంగన్వాడి సిబ్బంది,గర్భిణీలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.