బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…ABVP

పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.
విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ “విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు BC,SC,ST బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని,విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విశ్వవిద్యాలయాలకు వాటి బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ పెంచకుండా ప్రైవేటు యూనివర్సిటీల వలె విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి దాపురించిందన్నారు. అన్ని యూనివర్సిటీల్లో స్వీయ ఆర్థిక స్వావలంబన పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచి విద్యార్థుల రక్తం తాగుతున్నారన్నారు.( ఉదా,, కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్ 380 కోట్లు అయితే ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ 120 కోట్లు).
గురుకులాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో 83 మంది పేద పిల్లలు మరణించారని అయినా ఈ ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదన్నారు, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఆర్బాటంగా ఏర్పాటు చేసిన కామన్ మెనూ కార్యక్రమం అటకెక్కిందని, రోజుకో చోట ఫుడ్ పాయిజన్ నిత్య కృత్యం అయ్యిందన్నారు.
చాలా వరకు గురుకులాలు, డిగ్రీ కళాశాలలు,ITI కళాశాలలు పక్కా భవనాలు లేక అందులో చదివే పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు.
రాష్ట్ర పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో ఇది వరకే మంజూరు అయినా టీచింగ్ పోస్టులు 2878 అయితే ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నది అంటే 70% ఖాళీలతో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు.3 స్పెషలైజ్డ్ యూనివర్సిటీల్లో 50% ఖాళీలు దర్శనమిస్తున్నాయన్నారు. యూనివర్సిటీలకు VC లను నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం యూనివర్సిటీ లకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే పాలకమండళ్ళను నియమించలేదన్నారు.రాష్ట్రం లోని 149 డిగ్రీ కళాశాలల్లో 4059 టీచింగ్ పోస్టులు మంజూరు అయితే 2598 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,ITI, వృత్తి విద్యా కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు,జూనియర్ కళాశాలల్లో ఇప్పటికి గెస్ట్ లెక్చరర్లే దిక్కన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసమయం లో అనేక హామీలు,గ్యారెంటీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా విద్యార్థులను,నిరుద్యోగులను నట్టేటముంచిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సంవత్సర కాలం దాటినా 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్ తమ ఖాతాలో వేసుకుంటున్నదని దుయ్యబట్టారు. యువ వికాసం పేరుతో 5 లక్షల రూపాయల కార్డు లను యువతకు జారీ చేస్తామని,విద్యార్థులకు ల్యాప్ టాప్ లు,ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకుని ఇప్పుడు వెర్రి వేషాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు.
వెంటనే ఈ బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించడంతో పాటుగా, వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలని,విద్యారంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాంట్ ను వాటి బడ్జెట్ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి ,నిరుద్యోగ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించబోదని హెచ్చరించారు.

సదా భరతమాత సేవలో

మాచెర్ల.రాంబాబు
రాష్ట్ర కార్యదర్శి
[2:44 pm, 12/3/2025] Ramchandhar: ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అలివేలు.రాజు,కల్యాణి,శ్రీరామ్, రాకేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking