ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లో గల సహాయ కార్మిక శాఖ అధికారి సాయిబాబా తన కుమారుడి ద్వారా తన సొంత ఇంట్లో 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన గంగయ్య అనే వ్యక్తి తల్లి ఇటీవల మృతి చెందింది. అయితే మృతురాలు రిజిస్టర్ లేబర్ కావడంతో ఆమెకు రావాల్సిన లక్ష 30 వేల రూపాయల బెనిఫిట్స్ కోసం సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఫైల్ ను కార్మిక శాఖ కార్యాలయానికి పంపేందుకు 30 వేల రూపాయలను సాయిబాబా లంచంగా డిమాండ్ చేయగా 25 వేలు ఇచ్చేందుకు గంగయ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఈరోజు మధ్యాహ్నం అతని ఇంటి వద్ద కుమారుడు దామోదర్ ద్వారా గంగయ్య డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 25 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిందితులను కరీంనగర్ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి పేర్కొన్నారు.