భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ లోకసభ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి

 

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 18:
సాధారణ లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ లోకసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన శనివారం నాటి నుండే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్ విండో సిస్టం సువిధ యాప్ ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎం.సి.సి., సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎం.సీ.ఎం.సీ. కమిటీ, వ్యయ పర్యవేక్షణ, తదితర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. నూతన జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు,ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ స్థలాల్లో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ హరిప్రియా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై ఎస్ గౌడ్, బి జె పి మండల్ అధ్యక్షులు యాదగిరి, టి డిపి జిల్లా ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ అంతగాళ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking