ప్రజబలం ప్రతినిది: హైదరాబాద్ సెప్టెంబర్ 5:
భారతదేశం ప్రపంచ మానవాళికి ఒక విశ్వ గురువుగా వెలసిల్లిన చరిత్ర మన సొంతం. ఇక్కడ గురుపరంపర ప్రాచీన కాలం నుంచి ఉంది. మహాభారతంలో కూడా గురువు కోసం శిష్యుడు ఎలాంటి త్యాగం చేసేందుకు అయినా సిద్ధపడ్డ ఘటన ఏకలవ్యుడి రూపంలో మనం తెలుసుకోవచ్చు. మన పురాణాలు సైతం గురు బ్రహ్మ గురు విష్ణు అని గురువును దైవంతో పోల్చాయి. మాతృదేవోభవ పితృదేవోభవ అనంతరం ఆచార్య దేవో భవ అని గురువుకు నాగరికత సమున్నత స్థానం కల్పించింది. అయితే ఇలాంటి సమున్నతమైన చరిత్ర ఉన్న మన దేశంలో గురువును గౌరవించుకోవడానికి ఒక ప్రత్యేకమైన దినోత్సవం ఉంది అదే ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్మృతిస్తూ ఈరోజును టీచర్స్ డే గా జరుపుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక తత్వవేత్తగాను రాజకీయవేత్తగాను, రాజనీతిజ్ఞుడిగాను, ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఆయన తత్వశాస్త్రంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన ఉపాధ్యాయులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు 1931 వ సంవత్సరం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్ లర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అదే సంవత్సరం ఆయన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నైట్ హుడ్ పురస్కారం అందుకున్నారు.
ఫిలాసఫీ విభాగంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచంలోనే అత్యంత మేటి ఉపాధ్యాయులలో ఒకరిగా పేరు గడించారు. ఆయన పాఠం చెబుతూ ఉంటే విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది మేధావులు రాధాకృష్ణ ఉపన్యాసాలకు ఆశ్చర్యపోయేవారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన అనంతరం 1949లో ఏర్పాటుచేసిన ఉన్నత విద్యా సంస్కరణల కమిటీకి రాధాకృష్ణన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మన దేశంలో ఉన్నత విద్య ఎలా సాగాలి అనే అంశం పైన ఆయన ముసాయిదా తయారు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఆక్స్ఫర్డ్, కేం బ్రిడ్జి వంటివి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అనేక గౌరవ పురస్కారాలు డాక్టరేట్లను అందించాయి. 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నతో రాధాకృష్ణన్ ను సన్మానించింది. విద్యారంగంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి, భారత ప్రభుత్వం ఆయన పూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని కృత నిశ్చయంతో ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. టీచర్స్ డే సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు పాఠశాలలు కళాశాలలో ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతి నిర్మాణానికి వెన్నెముకగా నిలిచే రేపటి తరం విద్యార్థులను రూపుదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకమైన పాత్ర. వారిని సమున్నతంగా గౌరవించుకోవడం మనందరిబాధ్యత.