ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా మీడియా సమర్థవంతంగా పని చేయాలి- ఈటల రాజేందర్‌ , మల్కాజ్‌ గిరి పార్లమెంటు సభ్యులు

ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పిఐబి ప్రముఖ పాత్ర- జిల్లా పాలనాధికారి గౌతమ్‌ పోత్రు
4 సెప్టెంబర్‌ 2024, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి ప్రజాబలం ప్రతినిధి:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న చాలా సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేరడం లేదు, అవి వారికి చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే… ఆ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరాయా లేదా అని నిర్ధారించుకొని వార్తలు రాయాల్సిన బాధ్యత మాత్రం పాత్రికేయులదేనని ఈటల రాజేందర్‌, మల్కాజ్‌ గిరి పార్లమెంటు సభ్యులు అన్నారు.. బుధవారం మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్తలాప్‌ – వర్క్‌ షాప్‌ లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా పాలనాధికారి శ్రీ గౌతమ్‌ పోత్రు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఐబి లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్‌ షాప్‌లను నిర్వహిస్తోందని, ఇందుకు పిఐబి బృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో దానికి సంబంధించిన ఫీడ్బాక్‌ అందించాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని పాలనాథికారి అన్నారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు, మీడియా కు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీమతి శృతి పాటిల్‌ తన స్వాగతోపన్యాసం లో తెలిపారు.
జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ, కచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని, మనం వార్తలు రాసే ముందు నిర్దారణ చేసుకోవడం చాలా ముఖ్యమని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఈ డిజిటల్‌ యుగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం నవీకరించుకుంటూ వార్తలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.మీడియా లో విలువలు, అభివృద్ధి జర్నలిజం, అంశాలపై ఆయన మాట్లాడారు.
కృత్రిమ మేధ(ఎఐ) రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది.. ఇది మంచి పరిణామమే కావొచ్చు. అయితే ఈ సాంకేతికను కొందరు వేరే వాటికి ఉపయోగిస్తుండడం కలవర పెడుతోంది.కేవలం ఫొటోలు, వీడియోలే కాదు వాయిస్‌ను కూడా ఫేక్‌ చేయవచ్చు. సాంకేతికతను సరైన విధంగా వాడుకోవాల్సిన సామాజిక బాధ్యత పౌరులుగా మనందరి పై ఉందని సతేంద్ర గుప్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ డా. మానస్‌ కృష్ణ కాంత్‌ పి ఐ బి అధికారులు శ్రీమతి గాయత్రి, శివ చరణ్‌ రెడ్డితో పాటు మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి డీపీఆరో శ్రీమతి స్వర్ణ లత కూడా పాల్గొన్నారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking