ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలి

 

మేడ్చల్ నియోజకవర్గంలో పనులు ఏమాత్రం పెండింగ్ ఉండకుండా చూడాలి

అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 30:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందచేస్తున్నారని ఈ విషయంలో మేడ్చల్ నియోజకవర్గంలో పనులు ఏమాత్రం పెండింగ్ ఉండకుండా పూర్తి చేయాలని ఈ విషయంలో ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం శామీర్పేట్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవితో పాటు జిల్లా స్థాయి అధికారులతో నియోజకవర్గంలోని ఆయా అభివృద్ధి పనులు, పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఘట్కేసర్లోని ఆర్వోబీని వెంటనే పూర్తి చేయాలని ఈ విషయంలో పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆదేశించారు. దీంతో పాటు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరితగతిన అందించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వీలైనంత తొందరగా వారికి అందచేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారికి స్థలాలు, నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించి వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రెండో విడత దళిత బంధుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పనులను పూర్తి చేయాలని ఈ విషయంలో నిధుల కొరత లేనందున మరింత వేగవంతం చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి సమావేశంలో అధికారులకు వివరించారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులను తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసేలా తనవంతు కృషి చేస్తానని ఈ విషయంలో అధికారులు పనులు చేపట్టాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతినిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేశారని ఆ జాబితాను సైతం అందచేస్తామని మంత్రికి తెలిపారు. అలాగే ఘట్కేసర్ ఆర్వోబీ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ విన్నవించుకోగా వాటిని అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని సమావేశంలో కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking