తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌

 

హైదరాబాద్, జనవరి 16తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌లను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఫోన్‌ కాల్‌ ద్వారా సమాచారం అందించినట్లు అభ్యర్థులు నిర్దారించారు. అయితే అధికారికంగా అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై ఏఐసీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా, చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈ నెల 18 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు గడువు ఉండటంతో, ఆలోపు వీరు నామినేషన్లు దాఖలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు ఎల్లుండి లోపల నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 19 నామినేషన్ల పరిశీలన, 22వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి ఉంటాయి. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉండటంతో శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్‌ పార్టీకే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking