వరిధాన్యం కొనుగోలు కొరకు ముందస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా మార్చి 04 : ప్రభుత్వ ఆదేశాల మేరకు వరిధాన్యం కొనుగోలు కొరకు రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ఏర్పాట్లు,చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల, భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్,జిల్లా గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్,పౌరసరఫరాలు,వ్యవసాయ,సహకార,రవాణా,మార్కెటింగ్ శాఖల అధికారులు,మెప్మా అధికారులతో కలిసి రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులు, అధికారులతో యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం
నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.యాసంగి 2024-25 సంవత్సరానికి గాను గ్రేడ్ ఎ రకానికి 2 వేల 320 రూపాయలు,సాధారణ రకానికి 2 వేల 300 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు.వేసవి అయినందున నీడ,త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఓ.ఆర్.ఎస్.మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని తెలిపారు.తూకము
చేయడానికి వినియోగించే కాంటా,బాట్లు,తేమ శాతాన్ని పరిశీలించే మాయిశ్చర్ మీటర్,గన్నీ సంచులు సమకూర్చుకోవాలని,
అకాల వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ధాన్యం తూకం చేయడానికి ముందే సంబంధిత రైతు వద్ద నుండి కూపన్,బ్యాంక్ పాస్ పుస్తకం,ఆధార్ కార్డు,పట్టాదారు,పాస్ పుస్తకం నకలు ప్రతులను తీసుకోవాలని,ఇట్టి వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి ధాన్యం కొనుగోలు చేసి రశీదు జారీ చేయాలని తెలిపారు.సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో రైతులు విక్రయించనున్న సన్నరకం ధాన్యానికి వ్యవసాయ విస్తరణాధికారి ధృవీకరణ పత్రం అందించాలని తెలిపారు. కొనుగోలు,వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.కేంద్రానికి వచ్చిన గన్నీ సంచులను సరి చూసుకొని రిజిస్టర్ వివరాలు నమోదు చేయాలని తెలిపారు.వరిధాన్యం కొనుగోలు వివరాలను ప్రతి రోజు ట్యాబ్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని, నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.రైతులు కల్లాలలో ధాన్యాన్ని ఆరబెట్టి తప్ప,తాలు, మట్టిగడ్డలు లేకుండా నిబంధనల ప్రకారం పరిశీలించుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియకు కావలసిన తూకం యంత్రాలు,తేమ శాతం మీటర్లు,ప్యాడీ క్లీనర్లు,టార్పాలిన్ల కొరకు టెండర్లు ఆహ్వానించి కొనుగోలు చేయాలని తెలిపారు.వ్యవసాయ శాఖ పరిధిలో సన్నరకం,దొడ్డురకం గుర్తించి ధృవీకరణ పత్రం అందించాలని, పంట కోత సమయంలో హార్వెస్టర్ నియంత్రణ వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టాలని తెలిపారు. తూనికలు,కొలతల శాఖ ద్వారా పరీక్షించబడి ధృవీకరించబడిన తూకం యంత్రాలను మాత్రమే
కొనుగోలు ప్రక్రియలో వినియోగించాలని,కొనుగోలు కేంద్రాలలో మాన్యువల్ తూకం జరుగకుండా డిజిటల్ తూకం యంత్రాల ద్వారా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో 92 కొనుగోలు కేంద్రాలు,డి.సి.ఎం.ఎస్.ఆధ్వర్యంలో 67 కొనుగోలు కేంద్రాలు,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 150 కొనుగోలు కేంద్రాలు,మెప్మా ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన వారికి,సి.ఎం.ఆర్. డెలివరీ సకాలంలో చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపు జరుగుతుందని తెలిపారు.ప్యాడీ క్లీనర్లు అవసరమైన చోట ఏజెన్సీల ఆధ్వర్యంలో విద్యుత్ సౌకర్యం లేని కొనుగోలు కేంద్రాలలో తాత్కాలిక మీటర్లు ఏర్పాటు చేసుకొని వినియోగించాలని తెలిపారు.గన్నీ సంచుల నిర్వహణ పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా, వ్యవహరించాలని తెలిపారు. బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాలలో వరిధాన్యం పంట కోత ఆలస్యంగా ఒకేసారిగా వచ్చే అవకాశం ఉన్నందున రవాణా ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు,జిల్లా మేనేజర్ శ్రీకళ,జిల్లా మార్కెటింగ్ అధికారి షహబొద్దీన్,జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి,రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నల్మాసు కాంతయ్య,చిలువేరు వైకుంఠం,చిలువేరు శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking