ఆకిరి వ్యక్తిత్వాన్నీ, సేవలను కొనియాడిన మిత్రులు, సహోద్యోగులు
ఆకిరి రామకృష్ణారావు సంస్మరణ సభలో పుష్పాంజలి ఘటించిన బంధుమిత్రులు.
హైద్రాబాదు లోని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో వార్తా విభాగం అధిపతిగా పనిచేసి, ఇటీవల స్వర్గస్తులైన ఆకిరి రామకృష్ణారావు సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సోమాజీగూడా లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సెర్వీసెస్ లో పనిచేసిన సీనియర్ అధికారులు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తో పాటు స్వర్గీయ ఆకిరి రామకృష్ణారావు మిత్ర బృందం ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని సీనియర్ న్యూస్ రీడర్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు,Sr.Journalist, Hyderabad samay Hindi daily Editor and publisher షరీఫ్ మహమ్మద్ నిర్వహించారు. ముందుగా ఆకిరి రామకృష్ణారావు గారి సతీమణి శ్రీమతి స్వరాజ్య లక్ష్మి, కుమార్తె శ్రీమతి సాయి భార్గవి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆకిరి రామ కృష్ణారావుగారి సహోద్యోగులు, శిష్యులు, మిత్రులు రామకృష్ణారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిముషాలు మౌనం పాటించి, నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడిన వక్తలు రామకృష్ణారావు వ్యక్తిత్వం గురించి, వృత్తి పట్ల ఆయన నిబద్ధత అంకిత భావం గురించి మాట్లాడారు.

ఆకిరి గారితో వారికి గల అనుబంధాన్ని, స్నేహాన్ని, అనుభవాలను పంచుకున్నారు. సమాచార వ్యవస్థకి వెన్నుముకలా వ్యవహరించిన ఆకిరి రామ కృష్ణారావు మృతి జర్నలిజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. వార్తలను, నిర్భయంగా, నిర్మొహమాటంగా, సూటిగా అందించేవారనీ, అందరికీ తలలో నాలుకలా వ్యవహరించి, అడిగిన వారికీ, అడగని వారికీ సహాయం చేసేవారాన్నీ వారు చెప్పారు. సర్వీసులో ఉన్నప్పుడూ, రిటర్మెంట్ అయ్యాక కూడా ఎన్నో ప్రయోగాలు చేశారనీ, వార్తా ప్రసారంలో నూతన వరవడిని సృష్టించారని వారు వివరించారు. నిరుద్యోగులు, చిరుద్యోగులైన ఎంతో మంది జర్నలిస్టులను కష్టకాలంలో ఆదుకుని, వారికి ఆకాశవాణిలో, దూరదర్శన్ లతో పాటు, ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా ఉపాధి కల్పించారని, కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పి.ఐ.బి. డైరెక్టర్ జనరల్ ఎం.వి.వి.ఎస్. మూర్తి, యోజన సంపాదకులు సి.జి.కె.మూర్తి, సీనియర్ వార్తా సంపాదకులు, కె. రామచంద్రమూర్తి, ఆర్.వి.వి.కృష్ణారావు, ఆశయ్య, పాశం యాదగిరి, విరాహత్ అలీ, యూసుఫ్ బాబు, తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారి జ్వాలా నర్సింహారావు, సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, ఉదయవర్లు, వేణుగోపాల్, బాల, ఏ. గుణవర్ధన్, తోట భావనారాయణ, రంగాచారి,వి.జె.దివాకర్, ఆకాశవాణి, దూరదర్శన్, ఎస్.ఐ.ఈ.టి. అధికారులు – విజయ భగవాన్, అంబేద్కర్, ఈమని కృష్ణారావు, హనుమంతరావు, జి.కె.మూర్తి, ఖాన్ షకీల్, సమ్మెట నాగమల్లేశ్వరరావు, రాధాకృష్ణ, బాల్ భవన్ డైరెక్టర్, రసమయి ఎం.కె.రాము, ఐ.&పి.ఆర్.అధికారులు కిస్మత్ కుమార్, మార్పు గోపీనాథ్, ఏ. పి.ఎఫ్.డి.సి. మధు, పి.ఆర్.ఎస్.ఐ. మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు బాబ్జీ, వి.ఎస్.ఆర్.నాయుడు, కె.ఎం.కె.రావు, వేణు గోపాల నాయుడు, ఆకాశవాణి, దూరదర్శన్ లలో న్యూస్ రీడర్లుగా పనిచేసిన వి.ఎస్.ఆర్.మూర్తి, కృష్ణ మోహన్, రామ్మోహన్, చిలువేరు రఘురామ్, పోణంగి బాల భాస్కర్, జె.చెన్నయ్య తదితరులు పాల్గొని ఆకిరి రామ కృష్ణారావు గారితో తమ సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. రామకృష్ణారావు గారితో పరిచయం ఉన్న – వివిధ ప్రసార మాధ్యమాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని – స్వర్గీయ ఆకిరి రామకృష్ణారావు గారికి ఘనంగా నివాళులర్పించారు.
