బీసీ ఐక్యవేదిక నాయకులు రంగు రాజేశం
ఏప్రిల్ 7 నుండి మంచిర్యాలలో బీసీ చైతన్య యాత్ర
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : బీసీలంతా ఐక్యం అయ్యి తమ హక్కులకోసం పోరాడాలని బీసీ ఐక్యవేదిక నాయకులు రంగు రాజేశం పేర్కొన్నారు.ఈ నెల 7న మంచిర్యాలలో ప్రారంభం కానున్న బీసీ చైతన్య యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీ చైతన్య యాత్ర ప్రచార ప్రతులను వారు శుక్రవారం నాడు మంచిర్యాలలో విడుదల చేశారు. సమాజంలో 70 శాతం జనాభా కలిగిన బీసీ వర్గాల న్యాయమైన ఆకాంక్షలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. బీసీ జనఘణన మరియు రిజర్వేషన్ల పెంపు సాధన కోసం మెజార్టీ వర్గ ప్రజలు సమర శంఖం పూరించాలని వారు పిలుపునిచ్చారు. మహాత్మా ఫూలే చూపిన బాటలో బహుజన చైతన్యంతో మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని వారు కోరారు.బీసీ వర్గాల ప్రజల సమస్యల సాధన కోసం ప్రజలను జాగరూకులను చేయడం కోసమే బీసీ ప్రజా చైతన్య యాత్రను మంచిర్యాలలో జిల్లాలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.ఆదివారం రోజున ఉదయం పది గంటలకు మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ చైతన్య యాత్ర ప్రారంభమవుతుందని.. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి,మంచిర్యాల జిల్లా బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్య ముఖ్య అతిధులుగా పాల్గొంటారని వారు తెలిపారు.బీసీ చైతన్య యాత్ర ప్రారంభ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, ఉపాధ్యక్షులు నీరటి రాజన్న,చలమల్ల అంజయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.