బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
….. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి, ఫిబ్రవరి 3 ప్రజ బలం ప్రతినిది: విద్య అన్నది అత్యంత ప్రధానమైనదని, విద్యతోనే అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రిన్స్ పైప్స్ ఇండస్ట్రీ సహకారంతో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు అండగా ఉన్నత చదువులకు ఆర్థికచేయూత (స్కాలర్షిప్స్) అందించే కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ విద్య అన్నది అత్యంత ప్రధానమైన దన్నారు. అందులో అమ్మాయిలు తప్పని సరిగా చదువుకోవాలన్నారు. తమకంటూ ఓ ఆశయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.తమ ఆశయాన్ని సాధించేలా చదువుకోవాలని ఉద్భోదించారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ పైప్స్ యజమాన్యాన్ని, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. సదాశిపేట మండలంలోని వెంకటాపూర్, కోనాపూర్, వెల్టూర్, నిజాంపూర్, నంది కంది, పెద్దాపూర్, కోల్కూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో చదువులో చురుకైన 50 మంది బాలికలను గుర్తించి, వారు పదవ తరగతి తదుపరి చదువు కొనసాగించడానికి ప్రిన్స్ పైప్స్ వారు ఆర్థిక చేయూతగా ఒక్కొక్కరికి పదివేల రూపాయల స్కాలర్షిప్ ను అందిస్తున్న ట్లు జిల్లా విద్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధిత స్కాలర్షిప్ ను ఆయా విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తారని తెలిపారు. అదేవిధంగా సంబంధిత (7 ) పాఠశాలల్లోని 8, 9వ తరగతి చదువుతున్న 412 మంది విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్, పెన్నులు, తదితర కిట్స్ ను అందజేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఏడు పాఠశాలల్లో గుర్తించిన 50 మంది పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఐదు లక్షల రూపాయల చెక్కును, 8 ,9వ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కిట్స్ ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ, ప్రిన్స్ పైప్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
