ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో చేపడుతున్న ప్రజాపాలన సభలలో అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు తల్లాడ మండల కేంద్రం నారాయణపురం విఎం బంజర పెనుబల్లి మండలం కల్లూరు మండలం కల్లూరు గ్రామ పంచాయితీ సత్తుపల్లి మున్సిపాలిటీ13 వ వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యల పరిష్కరించే దిశగా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 407 గ్రామ పంచాయతీలు,60 వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి, 1 లక్షా 99 వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. దరఖాస్తులను పూర్తి ఉచితంగా, ముందస్తుగానే ఇంటింటికి అందజేసినట్లు, దరఖాస్తుదారులు తమ దరఖాస్తును నింపి దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలో అందించాలన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6, 2024 వరకు పని దినములలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజాపాలన సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు ఫారముతో పాటు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులు జతపరిస్తే సరిపోతుందని ఏ ఇతర దృవీకరణ పత్రాల అవసరం లేదన్నారు. దరఖాస్తుదారునికి తప్పనిసరిగా రశీదు అందించడం జరుగుతుందని, అట్టి రశీదును జాగ్రత్తగా భద్రపర్చుకోవాలన్నారు. కుటుంబానికి ఒక దరఖాస్తు సమర్పించాలని, కుటుంబ సభ్యులు ఏ పథక లబ్ది కావాలో అది పూరించాలని ఆయన తెలిపారు. ప్రజాపాలన సభల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లో సందేహాలు నివృత్తి కొరకు సహాయం పొందవచ్చ ని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ అప్పారావు, ఏడి ఫిషరీస్ ఆంజనేయ స్వామి, డిఆర్డీవో విద్యాచందన, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఎంపిడివో లు శ్రీదేవి, రవికుమార్, పెనుబల్లి తహసీల్దార్ ప్రతాప్, సత్తుపల్లి మునిసిపల్ కమీషనర్ సుజాత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు