విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు నిధులు పెంచాల్సింది
బడ్జెట్ పై సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్
ఖమ్మం ప్రతినిధి జులై 25 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయ రంగ కేటాయింపులు సంతృప్తికరంగా ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. గురువారం శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. సంక్షేమానికి రూ.40వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72,669 కోట్లు కేటాయించడం ఆహ్వానించ దగినదే అయినా మారిన పరిస్థితుల్లో మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సాగునీటి రంగానికి మరింతగా నిధులు పెంచాల్సి ఉందని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గత పదేళ్ల కాలంలో యావత్ తెలంగాణ నిధులన్ని కాళేశ్వరానికే మళ్లించడంతో అనేక ప్రాజెక్టులు నిధులు లేక అసంపూర్తిగా ఉన్నాయని ఈ ప్రభుత్వమైనా పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రసాద్ కోరారు. గృహజ్యోతి, ఉచిత బస్సు, మహిళా శక్తి పథకాలకు నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. విద్యా రంగానికి, ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు కేటాయింపులు పెంచాలని ప్రసాద్ కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయని, వడ్డీ చెల్లింపులకే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర అప్పు పెరుగుతుం డడం ఆందోళనకరమైన విషయమని రూ. 75,877కోట్ల అప్పు భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.