జిల్లా వ్యాప్తంగా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులు

 

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

జిల్లాలో టాంపర్ ఫ్రీ ప్రత్యేక సాఫ్ట్వేర్ సహకారంతో అర్హుల ఎంపిక

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 25: జిల్లా లోని
నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఐదు వందల మంది చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు, ఇళ్ళు లేని అర్హులైన వారు ఆత్మగౌరవంతో ఉండాలనే సదుద్దేశంతో జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాటిని ఎంతో పారదర్శకంగా కేటాయిస్తోందని ఈ విషయంలో ఎలాంటి పైరవీలు, జోక్యం లేకుండా లబ్ధిదారులకు అందచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,సమక్షంలో ఆన్ లైన్ లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు రాండ మైజేషన్ సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరిపారు.
జిల్లాలోని మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నియోజకవర్గానికి ఐదువందల(500) మందిని ప్రత్యేక సాఫ్ట్వేర్ (టాంపర్ ఫ్రీ) ద్వారా ఎంపిక చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మొత్తం 1,75,959 దరఖాస్తులు వచ్చాయని శుక్రవారం వరకు అర్హత కలిగిన లబ్దిదారులు 24,717 ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి మొదటి విడతగా 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి డబుల్ బెడ్రూమ్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో నివసించాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం జరిగిందన్నారు. ఈ విషయంలో అర్హులైన వారికి ముందుగా ప్రాధాన్యతనిస్తూ జిల్లా కలెక్టర్ సమక్షంలో టాంపర్ ఫ్రీ ప్రక్రియ ద్వారా ఇళ్ళను కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎవరైనా వ్యక్తులు లాటరీ పద్దతిన తీయడానికి బదులుగా ఈ విధానం ద్వారా ఇళ్ళ కేటాయింపులు జరపడం ద్వారా ఎంతో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తోందని ఇలాంటి ప్రక్రియ దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ ప్రక్రియ అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళ కేటాయింపు జరిగేంత వరకు నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసే విధానంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరించామని దీనికి గాను జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) వారి సహకారంతో ఎలాంటి విధంగా తారుమారు చేయలేకుండా ఉండేలా (టాంపర్ ఫ్రీ) సాఫ్ట్వేర్ ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులైన వారికి ఇళ్ళను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా లాటరీ పద్దతిన కేటాయింపు చేసే విధానం కంటే ప్రస్తుతం అన్ని రకాలుగా నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచించడం వల్ల ఈ ప్రక్రియను ఎంచుకొని అర్హులకు ఇళ్ళను కేటాయించినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే తక్కువ సమయంలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక జరిగేలా సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఇంకా ఇళ్ళ కేటాయింపులకు సంబంధించిన ఆయా దశల్లో సైతం ఉపయోగపడుతుందని ఒకసారి ఎంపికైన లబ్దిదారులు మళ్లీ ఎంపిక కాకుండా ఉండడానికి ఆధార్ నెంబరు ప్రాతిపాదికన దీనిని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కేటాయింపు సమయంతో పాటు తేదీ సైతం సాఫ్ట్ వేర్ లో నమోదు అవుతుందని అలాగే ఎంపిక జరిగిన తర్వాత అందుకు సంబంధించిన డేటాను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయడానికి వీల్లేకుండా ఒక రహస్య కోడ్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వల్ల లబ్దిదారుల ఎంపిక సులభతరంగా జరగడంతో పాటు పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి,సీపీవో మోహన్ రావు , జిల్లా ఇండస్ట్రీస్ అధికారి,రవీందర్ ఆర్డీవోలు రాజేష్ కుమార్ శ్యామ్ ప్రకాశ్, డిప్యూటీ కమీషనర్ లు , జిల్లా స్థాయి అధికారులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking