మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు రిజర్వేషన్ల కేటాయింపులు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 3:
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్ లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లక్కీ డ్రా నిర్వహించారు .
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో మద్యం దుకాణాలను ఎస్.టి.లకు, ఎస్.సి.లకు, గౌడ లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులననుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అరుణ్ కుమార్, విజయ భాస్కర్, జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశూరామ్, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వినోద్, ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ పాలసీ ప్రకారం గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన జిల్లాలోని మద్యం దుకాణాలకు కేటాయింపులు జరిపారు. ఈ సందర్భంగా డ్రాలో మేడ్చల్ వ్యాప్తంగా 114 మద్యం దుకాణాలు ఉండగా,గౌడ కులస్తులకు 11 దుకాణాలు, ఎస్సీలకు 5 దుకాణాలు, ఎస్టీలకు ఒకటి చొప్పున వచ్చాయి. అలాగే మల్కాజిగిరిలో 88 మద్యం దుకాణాలకు గాను గౌడ కులస్తులకు 12 దుకాణాలు, ఎస్సీలకు 7 దుకాణాలు, ఎస్టీలకు ఒక దుకాణం చొప్పున వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులు జరిపి వాటికి సంబంధించి డ్రా తీసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఆయా రిజర్వేషన్ల ప్రాతిపదికన డ్రా పద్దతిన మద్యం దుకాణాలను కేటాయింపులు జరిపినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేష్ కుమార్, శ్యామ్ప్రకాశ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.