ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్భందీ చర్యలు

 

జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పకడ్భందీ ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి వీడియో సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడారు.
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వీడియో సమావేశంలో జరిగిన అంశాలను జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయడానకి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవీఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు వివరించారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సీ–విజల్ యాప్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని తెలిపారు. మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే అప్పీల్పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, రూ.10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటీ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking