ప్రభుత్వ నిబంధనల ప్రకారం 59 జీవోను త్వరితగతిన పూర్తి చేయాలి

తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టిసారించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు 59 నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాని దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 59, రెండు పడకల ఇండ్ల ప్రగతి పై, జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయా మండలాల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 59 జీవోకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ విషయంలో ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అధికారులు తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు సమన్వయంతో వేగవంతం చేసి పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి 59 జీవోలో ఎలాంటి పెండింగ్లు ఉండకుండా అర్హులను గుర్తించాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ జీవోలో అర్హులైన వారిని గుర్తించిన తర్వాత క్రమబద్దీకరణకు సంబంధించి వారికి మూడు విడతలుగా డబ్బులు చెల్లించుటకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, కాగా ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నదని, ఇట్టి చక్కటి అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో వివరించారు. రెండు పడకల ఇండ్ల ప్రగతిని సమీక్షిస్తూ ఇళ్ల పట్టాలు అందించిన వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ముగింపు దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి మర్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆయా మండలాల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking