– జాతీయ ఉద్యోగుల ప్రతినిధుల మహాసభలో తెలంగాణా రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
• ఒబిసి రిజర్వేషన్ల అమలులో “బ్యాక్ లాగ్” విధానం అమలులోకి తేవాలి.
• నాన్ క్రీమి లేయర్ ఆదాయ పరిమితిని 20 లక్షలకు పెంచాలి.
• సామజిక, ఆర్థిక కులగణన – 2011 వివరాలను రాష్ట్రాల వారిగా అధికారికంగా వెల్లడించాలి.
దేశంలో మెజార్టీ జనాభా కలిగిన ఒబిసి లను నిర్లక్ష్యం చేయడం తగదని అన్ని రంగాలలో వారి జనాభా మేరకు వాటా దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని తెలంగాణా రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
జాతీయ OBC ఉద్యోగ సంఘాల సమాఖ్య, అల్ ఇండియా ఒబిసి రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒబిసి రిజర్వేషన్ల అమలు తీరు-తెన్నులు అనే అంశంపై సెమినార్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విశాఖపట్నం లోని మాధవధారలో గల ఒక ప్రైవేటు హోటల్ లో జరిగింది. ఉద్యోగ సంఘాల నేత డా. పెదరెడ్ల రాజశేఖర్ సెమినార్ కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సెమినార్ లో ముఖ్య అతిథి డా. వకుళాభరణం ప్రసంగిస్తూ… బిసి కమిషన్లు ఆయా కమిషన్ల నివేదికలోని సిఫారసులు, రిజర్వేషన్ల తీరు-తెన్నులు మున్నగు పలు అంశాలపై కీలక ఉపన్యాసం చేశారు.

బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను ఏళ్ళ తరబడిగా చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర విద్య, ఉద్యోగ సంస్థలలో అమలు చేస్తున్న 27% రిజర్వేషన్లకు గాను ఇప్పటి వరకు ప్రతి యేటా కనీసం 15% అభ్యర్థులు కూడా లభించడం లేదని అన్నారు. అందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టడం దుర్మార్గం అన్నారు. అభ్యర్థులు లభించకపోతే బ్యాక్ లాగ్ విధానం ద్వారా స్పెషల్ డ్రైవ్ లతో ఉద్యోగ నియామకాలు జరపాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ఈ విధానం అమలుకు చర్యలు గైకొనక పోవడం బిసిల వ్యతిరేక వైఖరిగానే భావించాల్సి వస్తుందన్నారు. సుమారు 5వేల కోట్లు వెచ్చించి నిర్వహించిన సామాజిక, ఆర్ధిక కులగణన – 2011 వివరాలను బహిర్గతం చేయకపోవడం కేంద్రం యొక్క నైజాన్ని తెలుపుందన్నారు.
నిధులతో, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా తీసుకోవాల్సిన పలు విధాన పరమైన నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకోక పోవడం విచారాన్ని కలిగిస్తున్నది అన్నారు.
పెదరెడ్ల రాజశేఖర్
ఛైర్మన్
అల్ ఇండియా ఒబిసి రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్