ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లూ ఖరారయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం మంచిర్యాలలోని బీసీ భవన్ లో ప్రచార కరపత్రాలను వారు ఆవిష్కరించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని వారు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామిని నిలబెట్టుకోవాలని వారు తెలిపారు.రిజర్వేషన్లన్ని తేల్చడం కోసం ముందుగా బీసీ జన గణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు.బీసీలు అంటే వెనుకబడిన వారు కాదని, వెనక్కు నెట్టి వేయబడిన వారని వారు పేర్కొన్నారు. జనాభాకి అనుగుణంగా సామాజిక వాటా దక్కితేనే ప్రజాస్వామ్యం నిలబడినట్టు అవుతుందని తెలిపారు. మరోమారు మోసగించ బడడానికి బీసీలు సిద్ధంగా లేరని,తమ న్యాయమైన హక్కుల కోసం బీసీ బిడ్డలు ఉద్యమించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్,సీనియర్ బీసీ నాయకులు చలమల్ల అంజయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం,బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు,మోర చరణ్ కుమార్,రామస్వామి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.