బీసీ లకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలింది:

వ్యాసకర్త
కోట దామోదర్

దేశంలో అత్యధిక ఓటర్లు బీసీ కులాల వారే అనే విషయం ప్రతి నాయకుడికి తెలుసు. కానీ వారికి రాజ్యాధికారం ఇవ్వడానికి అంగీకరించరు. బి సి కుల గణన విషయంలో ప్రజలను మభ్యపెడుతూ తప్పుదోవ పట్టించడం గాక, వారిని మరిపించి మురిపించే ప్రయత్నం చేయడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు అనే విషయం ప్రతి బీసీ ఓటరుకు తెలుసు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75  సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి బి సి కుల గణన కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం బి సి వారు ఉండగా వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం.

మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది, ఆ సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు. జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కుల గణన అంశం చర్చకు రాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. షేడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్ప 70 యేండ్లు గడిచిన నేటికీ బి సి కుల గణన చేపట్టడం లేదు. బీసీ కులాల గణన వివరాలు చేపట్టాలని సుప్రీం కోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నది అంతుచిక్కని     ప్రశ్నగా మారింది. బి సి కుల గణన వివరాలు చేపట్టక పోవడానికి బలమైన కారణమేంటో ప్రతి బీసీ ఓటరు తెలుసుకోవాలి.  మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థలు మరియు అసెంబ్లీ, కమిషన్ అనేక రాజకీయ పార్టీల కార్యవిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత శాతం? అందులో బి సి ల శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు. కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం మరింత బాధాకరం. అగ్రవర్ణాలు శాశ్వతంగా పాలించేలా బీసీ కులాలను అణిచివేతకు గురిచేస్తున్నారనడంలో సందేహం లేదు.

జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికీ సరైన రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బి సి కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుందనేది ముమ్మాటికీ నిజం. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సరి మేము గెలిస్తే బి సి లకు రాజ్యాధికారం ఇస్తామని మురిపించి ఓట్లు దండుకుంటున్నారు తప్ప బి సి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు.

తెలంగాణలో బి సి లకు ప్రాధాన్యత కరువు:

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది బి సి లు. తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి, విద్య, వైద్య, ఉద్యోగం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, తమ హక్కులకు రక్షణ కలుగుతుందని భావించి ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా పోలీస్ లాఠీ దెబ్బలకు వెనుతిరగకుండా, ఆత్మబలిదానాలకు కూడా లెక్కచేయకుండా అమరులైనారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం  సాధించుకున్నారు. అమరులంతా బీసీలే కావడం గమనార్హం. మృతుల కుటుంబాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం శోచనీయం. స్వరాష్ట్రం వస్తే తమకు సరైన న్యాయం జరుగుతుందని భావించిన బి సి లకు 2014 ఎలక్షన్ లో నాయకులు ఈసారి గెలిస్తే బి సి కుల గణన చేపడతామని హమిచ్చారు. కానీ నేటికీ హామీ నెరవేరలేదు. ఉద్యమానికి ఊపిరి గా నిలిచిన బి సి లకు ఎన్నికల్లో సరైన సీట్లు కేటాయించకుండా వివక్ష చూపింది. తొమ్మిదేండ్ల పాలనలో విసుగు చెందిన బి సి కుల సంఘాలు స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు దాటిన ఇంకెన్నాళ్లు అర్ధ బానిసలుగా బ్రతకాలి అనే ప్రశ్నలు మేధావుల్లో, యువతలో తలెత్తుతున్నాయి. అంతర్గత వివక్షను వ్యతిరేకిస్తూ రాజ్యాంగం సూచించిన తమ హక్కుల పరిరక్షణ కోసం, పాలనలో సరైన వాటా కోసం,  సమిష్టి ఉద్యమాలు ఎంతైనా అవసరమని భావిస్తూ బి సి కుల సంఘాలన్నీ ఐక్యంగా, ఇక లక్ష్యంగా రాజకీయ ఉద్యమ వేదికలను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

అత్యధిక ఓటర్లైన పద్మశాలీయులకు రాజ్యాధికారంలో మొండిచేయి:

భారతదేశంలో ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న పద్మశాలీయులు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. పద్మశాలి సంఘం గణాంకాల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది అనధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం 23 లక్షల మంది ఓటర్లు ఉంటారు. నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న పద్మశాలి రాజకీయంగా ఎదగలేక పోవడం బాధాకరం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఒక్క పద్మశాలికే ఉందంటే అతిశయోక్తి కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా అగ్రకుల నాయకుల ఎత్తుగడలకు   ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం పద్మశాలీల కుల సంఘాలను విచ్చిన్నం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప రాజకీయంగా ఎదగకుండా అణచివేశారు. ప్రత్యేక తెలంగాణ సాదించుకుంటే రాజకీయంగా ఎదుగుతామని భావించిన పద్మశాలీయులకు 9 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పద్మశాలి వర్గంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, యువకులు బానిస బ్రతుకు బ్రతికే కన్నా పోరాడితే పోయేది ఏమి లేదని రాజ్యాధికార సాధన కొరకు మరియు 2023 ఎలక్షన్ లో పద్మశాలీయుల సత్తా చాటడం కోసం కుల సంఘాల్లాంటిని ఒకే వేదిక గా నిలిచేందుకు   ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఈసారి అయినా అగ్రవర్ణాల నాయకులు పద్మశాలీయులను రాజకీయంగా ఎదగనిస్తారా లేదా అనేది ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీసీ కులాలు తమ అస్తిత్వాన్ని పక్కనపెట్టి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ వచ్చింది. బి సి లకు టిక్కెట్ల పంపకం లో కూడా పూర్తి వ్యతిరేకత చూపింది.

బీసీలందరు ఏకం కావాలి:

అగ్రవర్ణాల ఆధిపత్యంతో అణచివేతకు గురవుతున్న బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలు బీసీ సంఘాలు సంకేతాలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు కులాల వారీగా రాజకీయ పోరుబాట పట్టే సంఘాలు ఇప్పటి నుంచే సమావేశమవుతున్నాయి. ఏదిఏమైనా బీసీ ప్రజలంతా ఒక్కటిగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం పోరాడితేనే రాజ్యాధికారం దక్కుతుందనేది జగమెరిగిన సత్యం.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం మరియు బీసీ కుల గణన విషయం తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఎదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారు.

ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీలకు రాజ్యాధికారం అందించేలా కృషి చేయాలనీ ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking