భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

 

అధికారులు కార్య స్థానాలు వదిలి వెళ్ళరాదు

అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా దిశా, నిర్దేశం

……జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, జూలై 25 ప్రజ బలం ప్రతినిది:
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ శరత్ మంగళవారం రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా దిశా, నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ఎడతెరపిలేని వర్షాల వల్ల ఇప్పటివరకు ఎన్ని చెరువులు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయి, వాగులు, కాల్వల పరిస్థితులను అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శి కోఆర్డినేషన్తో నీటిపారుదల శాఖ ఏఈలు తనిఖీ చేయాలని, పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, అప్రమత్తతో కూడిన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హితవు పలికారు.
ముఖ్యంగా చెరువులకు గండ్లు పడకుండా నీటి నిల్వలను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, చేపల వేటకు ప్రజలెవరూ వెళ్లకుండా చూడాలన్నారు. అలాగే యువత, పిల్లలు ఈత కోసం చెరువులు, కాల్వలలోకి దిగకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఆయా అధికారుల కోఆర్డినేషన్తో వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా విద్యుత్ వైర్లను తాకకూడదని, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్ళవద్దని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
ఆడియో ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వంగిన కరెంట్ పోల్స్, వేలాడుతున్న తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.
మున్సిపల్, ఆర్ అండ్ బి రోడ్లన్నింటినీ తనిఖీ చేయాలని, ఇంతకుముందు జరిగిన ప్రమాదాలు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. రోడ్లపై ఓవర్ ఫ్లో అవుతున్న నీటి నుండి ప్రజలు, వాహనాలు వెళ్ళకుండా డైవర్ట్ చేయాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ అప్రమత్తంగా ఉండాలన్నారు.
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరగాలన్నారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు వారి వారి పరిధిలోగల రోడ్లు, కల్వర్టులు, ట్యాంకులను పి ఆర్ ఏఈ ,ఎం పి ఓ, పంచాయతీ సెక్రెటరీలు తనిఖీ చేయాలని, ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పురాతన, నానిన గోడలు, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎంపీడీవోలకు సూచించారు.
లో లైన్ ఏరియాలో ఎక్కడ నీటి నిల్వ ఉండకుండా చూడాలని, త్రాగునీటి సరఫరా సవ్యంగా జరగాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ, ఎంపీఓలు, డి ఎల్ పి ఓ లు క్షేత్ర పరిధిలో పర్యటించి పర్యవేక్షించాలని సూచించారు.
జిపిలు, మున్సిపాలిటీలలో ప్రతిరోజు ఉదయం 7 గంటల వరకు పారిశుద్ధ్య పనులు జరగాలని, రోడ్లు, నాళాలు, మురుగు కాలువలను శుభ్రం చేయించాలని తెలిపారు.
వర్షాల తో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ప్రజలు తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే లా అవగాహన కల్పించాలన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.
వర్షాల వల్ల ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08455 – 272233 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. కంట్రోల్ రూమ్ నిరంతరం 24/7 పని చేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు.
ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్ అండ్ బి, నీటిపారుదల, విద్యుత్ శాఖల ఎస్ ఈ లు, పంచాయితీ రాజ్ ఈ ఈ, డిపిఓ, డి ఎం అండ్ హెచ్ ఓ, మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking