విభిన్న మతాలు, వర్గాలు, ప్రత్యేక సామాజిక నేపథ్యాలున్న అటువంటి నారీరత్నాలను కూర్చి, పేర్చిన పూదండ ఇది. మీరాబాయి, పన్నాథాయ్, రాణి దుర్గావతి, చాంద్ సుల్తానా, నూర్జహాన్, రాజమాత జిజాబాయి, తారాబాయి, రాణి భవానీ, అహల్యాబాయి, వీరనారి చెన్నమ్మ, మహారాణి లక్షీబాయి, బేగం హజ్రత్ మహల్, అనీ బీసెంట్, పండిత రమాబాయి, మాతా శారదా దేవి, రమాబాయి రానడే, సోదరి నివేదిత, కస్తూర్బా, సరోజినీ నాయుడు, సుభద్రా కుమారి చౌహాన్ల వీరోచిత, త్యాగమయ చరిత్రల పరిచయం-అన్ని తరాలకు మరీ ముఖ్యంగా ప్రస్తుత తరానికి మార్గదర్శకంగా, ఒక ప్రేరణగా నిలుస్తుంది. వారిలో చైతన్యాన్ని నింపడంకన్నా ముందు జడత్వాన్ని పోగొట్టగల శక్తి ఈ పుస్తకానికి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.
మీరాబాయి జీవితగాథను అక్షరీకరించిన రచయిత చివర్లో …‘‘ప్రపంచంలోని చక్రవర్తుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోవచ్చుగానీ మీరాబాయి మాత్రం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది’’ అని వ్యాఖ్యానించాడు. ‘‘కర్తవ్య నిర్వహణలో భాగంగా కన్నబిడ్డను బలిదానం చేసిన పన్నాధాయ్ లాంటి వీరమాత ధన్యురాలు.నేటికీ చిత్తోఢ్ లోని తల్లులు తమ బిడ్డలకు పన్నా కథను కథలుకథలుగా చెప్పకుంటుంటారు’’. ఇటువంటివే మరికొన్ని …
‘‘అక్బర్ చక్రవర్తికి తను పంపే నజరానా పర్యవసానం యుద్ధమేనని రాణి దుర్గావతికికూడా తెలుసు.
ఇదీ- నిప్పని తెలిసీ చెలగాటమాడిన రాణీ దుర్గావతి తెగువ, చతురతకూడా.
అనేక సంక్షోభాల్లో చాలాకాలం ప్రత్యక్షంగా పాలుపంచుకోవడమేగాక అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబుల పాలనను కళ్ళతో చూసిన నూర్జహాన్ ను గురించి తెలుసుకోవడం అంటే మొగలాయీల పాలనను అర్థం చేసుకోవడం. ఆమెది అంత ప్రభావవంతమైన జీవితం. ‘‘నూర్జహాన్ సమకాలికులలో ఆమెతో పోటీపడగల స్ర్తీ ప్రపంచంలోనే ఎవరూ లేరు. సమానులలో ఒక్క ఎలిజబెత్ మాత్రమే గుర్తొస్తారు.
‘‘తను కన్న స్వప్నం తన జీవితకాలంలోనే సాకారంగా చూడగల సౌభాగ్యం చాలా కొందరికే లభిస్తుంది. అటువంటి అదృష్టవంతులయిన మహిళల్లో ఛత్రపతి శివాజీ తల్లి జీజాబాయి ఒకరు.’’
‘‘ఝూన్సీలక్ష్మీబాయికన్నా ముందే మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో … 19వ శతాబ్దంలోనే మొట్టమొదటిసారి ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన భారత వీరాంగన చెన్నమ్మే.’’
బడి పుస్తకాలు బతుకుతెరువుకు ఉపయోగపడతాయి. ఇటువంటి పుస్తకాలు బతుకుకు ఒక అర్థం, పరమార్థం తెలిసేటట్లు చేస్తాయి.
(భారత ప్రభుత్వ ప్రచురణల విభాగం, 6వ ముద్రణ, పేజీలు-147, వెల-రు.140,
లభ్యత- అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ప్రచురణకర్తల విక్రయ కేంద్రాల్లో)