ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 2 (ప్రజాబలం) ఖమ్మం తల్లి పాలు బిడ్డకి ఎంతో ఆరోగ్యకరమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖచే నిర్వహించిన ర్యాలీని పెవిలియన్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తల్లి పాల ప్రాముఖ్యతను తెలుపుతూ, నినాదాలు, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలతో ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా ప్రధాన ఆసుపత్రి వరకు ప్రధాన రహదారి వెంబడి సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తల్లి పాలు తమ బిడ్డలకి చాలా ఆరోగ్యకరమని, ప్రసవించిన అర గంట లోపు ముర్రు పాలు పట్టించాలని, అవి లేత పసుపు రంగులో ఉంటాయని, పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఆరు నెలల వరకు తల్లి పాలే పట్టించాలని, ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు, అదనపు ఆహారం పెట్టాలని ఆయన అన్నారు. డబ్బా పాలు ఆరోగ్యానికీ హానికరమని, ఆరు నెలల వరకు నీరు, తేనే వంటి ఏ పానీయం పసి పిల్లలకు పెట్టకూడదని ఆయన తెలిపారు. గర్భవతులు మంచి పోషకాహారం తీసుకోవాలని, పప్పు ధాన్యలు, మాంస కృత్తులు ఎక్కువగా తీసుకోవాలని, అంగన్వాడి కేంద్రాలలో గర్బవతులకు న్యూట్రిషన్ ఆహారం ఇస్తారని, అందరు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత అందరికి తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సైదులు, జిల్లా ప్రధాన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, వైద్య ఆరోగ్య, సంక్షేమ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు