ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 2 (ప్రజాబలం) ఖమ్మం దళితబంధు లబ్దిదారులకు పథక పూర్తి లబ్దిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దళితబంధు చింతకాని మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి, పథక అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతకాని మండలంలో దళిత బంధు పథక అర్హులైన లబ్దిదారులందరికి పథక లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. మండలంలో 25 గ్రామాల నుండి 3462 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళితబంధు పథకం క్రింద వివిధ రకాల యూనిట్లను మంజూరు చేసి, గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. యూనిట్ల విలువను బట్టి, దళితబంధు పథక అర్హత మంజూరు మొత్తం నుండి నిధులను లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. 1888 మంది లబ్దిదారులకు పూర్తి మొత్తం అందజేయగా, మిగతా వారికి వారి వారి ఎంపిక ప్రకారం మొత్తాన్ని అందజేశామన్నారు. యూనిట్, యూనిట్ ధర, ఇంకనూ దళితబంధు అర్హతలో చెల్లించాల్సిన మొత్తం, గ్రామాల వారీగా, లబ్ధిదారుల వారీగా నివేదిక సమర్పించాలన్నారు. లబ్దిదారులకు మంజూరు యూనిట్, ప్రస్తుతం దాని పరిస్థితి, లబ్దిదారుడు అట్టి యూనిట్ తో ఉపాధి పొందుతున్నది, ఇప్పటి వరకు మంజూరు పోనూ, మిగిలిన సొమ్ముతో ఏమి చేయదల్చుకున్నది, యూనిట్ సంబంధ ఉపకరణాలు లేదా మరో యూనిట్ మంజూరు విషయమై లబ్దిదారునితో చర్చించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, లబ్దిదారునికి ఆర్థికాభివృద్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డిఆర్డీవో సన్యాసయ్య, జెడ్పి సిఇఓ ఎస్. వినోద్, ఎస్సి కార్పొరేషన్ అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ అధికారి నవీన్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు చింతకాని మండల దళితబంధు పథక గ్రామ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు