ట్రాక్టర్ బోల్తా ఘటనకు బీఆర్ఎస్ పార్టీనే నైతిక బాధ్యత వహించాలి

 

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ప్రమాదంలో మృతి చెందిన అనసూర్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు

బాధిత కుటుంబానికి రూ. 50లక్షలు ఇవ్వాలని డిమాండ్

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 27 ప్రజాబలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాన్ తండాలో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనకు బీఆర్ఎస్ పార్టీనే నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన అనసూర్య మృతదేహాన్ని కూసుమంచిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని యువనేత పొంగులేటి హర్షరెడ్డితో కలిసి పరామర్శించారు. రక్తమోడిన శరీరాలతో తీవ్రగాయాల బాధతో రోధిస్తున్న వారితో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై పొంగులేటి శీనన్న కలత చెందారని పలుమార్లు ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, ఖమ్మం వచ్చాక స్వయంగా ఆయనే వారిని కలిసి పరామర్శిస్తారని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రజా ప్రతినిధులు, సీఎం స్పందించకపోవడం సరికాదని అన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని, పూర్తిగా అండగా ఉంటామని అభయమిచ్చారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఘటనకు బీఆర్ఎస్ పార్టీ నైతిక బాధ్యత వహిస్తూ చనిపోయిన అనసూర్య కుటుంబానికి రూ. 50లక్షలు, క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకట రెడ్డి, జొన్నల గడ్డ రవి, తమ్మినేని నవీన్, హఫీజ్, బారి వీరభద్రం, సుధాకర్ రెడ్డి, మంకెన వాసు, మదాసు ఉపేందర్, రామి రెడ్డి, మనోహర్, జనార్ధన్ గౌడ్, మచ్చా నాయక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking