కే శ్రీనివాస్ చారి
పొలిటికల్ అనలిస్ట్.
మెదక్ తూప్రాన్ మార్చ్ 5 ప్రజాబలం న్యూస్:-
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గార్లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి రెండు గంటలకు కష్టపడి చర్చించుకుని తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. తమ పార్టీలు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు పొత్తులు పెట్టుకుని పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. భారతదేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని, బిజెపి అధికారంలోకి వచ్చే కనిపిస్తున్నాయని, అలాగైతే వారు
భారత రాజ్యాంగాన్ని మారుస్తారని అన్నారు. కాంగ్రెస్ తీరు కూడా ఇంచుమించు బిజెపి లాగానే ఉంది కనుక తాము కాంగ్రెస్ వైపు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. బి.ఎస్.పి కి బీఆర్ఎస్కు మధ్య భావ సారూప్యత ఉన్నదని, దళిత బంధు, రెసిడెన్షియల్ పాఠశాలలు తదితర విషయాల్లో పార్టీల మధ్య పోలిక ఉన్నందున తాము కలిసి పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్టుగా ఇరువురు నేతలు మీడియాకు వివరించారు. ఈ కలయిక ఎందుకు, ఏ తీరున సాధ్యమవుతున్నదో ఇదమిద్దంగా చెప్పడంలో ఇరువురు నేతలు చెప్పడంలో వెనకడుగు వేశారు. ఈ నిర్ణయాన్ని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రజలు ఎవరు తెలంగాణలో ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మొన్నటి వరకు బి ఆర్ ఎస్ ను, అత్యంత తీవ్రంగా విమర్శించిన బీఎస్పీ నేత ఇప్పుడు కెసిఆర్ పంచన చేరటం అవివేకం. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కెసిఆర్ ఎన్ని పార్టీలను తన తోక పార్టీలుగా మార్చుకోలేదు? అలాగే ఈరోజు బీఎస్పీ కూడా ఆ తోక పార్టీల సరసన చేరిపోయింది. బహుజన రాజ్యం కోరుకునే ఏ కార్యకర్త, సానుభూతిపరులు ఎవరు ఈ నిర్ణయాన్ని స్వాగతించేలా కనబడడం లేదు. భిన్న ధ్రువాలుగా ఉన్న రెండు పార్టీలు ఏవో చిన్న చిన్న కారణాలను చూపెట్టి నిసిగ్గుగా అల్లుకుపోవడం అంటే క్రింది స్థాయి కార్యకర్తలను అవమానపరచడమే. పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే. ఈ నిర్ణయం బీఆర్ఎస్కు లాభిస్తుందో ఏమో గాని బీఎస్పీకి మాత్రం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. బహుజన వాదం ప్రవీణ్ కుమార్ సారథ్యంలో బాగా వికసించింది అని చెప్పుకునే సమయంలో ఈ నిర్ణయం బహుజన వాదులను కలవరపరుస్తున్నది. అగ్రకుల అహంకారంతో, అవినీతి కూపంలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీని బీఎస్పీ ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ఆ ఊబిలోనే కూరుకుపోతానని నిర్ణయించుకుంటే కాపాడేది ఎవరు? అని పొలిటికల్ అనలిస్ట్ కే శ్రీనివాస్ చారి పత్రిక ప్రకటనలో తెలిపారు
– కె శ్రీనివాసాచారి
పొలిటికల్ అనలిస్ట్