“నాన్న ప్రేమ పాలలోని వెన్న”.

“తల్లి, తండ్రి, గురువు, దైవం” అని
ఆది నుండి అమ్మకు ప్రథమస్థానం ఇవ్వడం సముచితం.
అయితే స్థానవిలువల మాట అటుంచితే సంతానం అనే బండికి చక్రాలు, బండిలాగే జోడెద్దులు అమ్మానాన్నలు.
మరి నాన్న ఎందుకు అమ్మకు తరువాతే ?
ఇంటిలో టమాటోలతో బంతాట ఆడుతున్న పాపతో అమ్మ”కూరగాయలతో ఆడుకుంటున్నావా? సాయంత్రం నాన్న వచ్చాక నీ సంగతి చెపుతా” అంటుంది. కూరగాయలతో ఆడుకోకూడదని తనే చెప్పొచ్చుగా‌. నాన్నంటే భయమేసే తొలి బీజం .
బడిలో అల్లరి చేసిన పిల్లవాడితో
ఉపాధ్యాయుడు “మీ నాన్నను తీసుకురా, నీ తప్పులు
చెప్పాలి”. నాన్నంటే భయానికి మరో రూపకల్పన.
ప్రతీ ఒక్కరూ ” నవమాసాలు మోసి నిన్ను కన్నది”అని చెప్పేవారే. “నిన్ను,నిన్ను నవమాసాలు మోసిన అమ్మనూ గుండెలో మోసినవాడే నాన్న” అని చెప్పేదెవరు.
అందుబాటులో వున్న పందిరికే తీగ అల్లుకుంటుంది,అనురాగబంధంతో పెనవేసుకొని పెరుగుతుంది. అమ్మ పందిరైతే పిల్లలు అల్లుకునే తీగలు.
నాన్న పందిరివేసి తీగలను అల్లించి వాటి పోషణకోసం, పొద్దున్నే నీవు నిదురలేవకనే పనికెళ్ళి ,పొద్దపోయి నీవు నిదురపోయాక ఇంటికొచ్చి ,నీ తల నిమురుతూ తన అలసట మరచే నాన్నకు నీతో సాన్నిత్యమెక్కడ. ఓ మగాడు తన కోసం బతికేది తను తండ్రి అయ్యే వరకే,
తరువాత బతుకంతా పిల్లల కోసమే .
సాహిత్యంలో అమ్మ గురించి రచనలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. నాన్న గురించి వచ్చినవి తక్కువనే చెప్పాలి. మునుపు నాన్న గురించి
ఎంత సాహిత్యం వచ్చినా, ఇటీవల “నాన్న పచ్చి అబద్ధాలకోరు” కవిత మెరుపు లేని ఉరుములా ఓ ఊపు వూపింది. తరువాత ” నాన్న ఎందుకో వెనుకబడ్డాడు” కవిత ఓ కుదుపు కుదిపింది. ఆ ప్రవాహంలో నాన్న కవితలు వెల్లువై పారాయి.
కవి “నాన్న”ను దేవుడని కదా అనాలి.
మరి”నాన్న పచ్చి అబద్ధాలకోరు” అని ఎందుకన్నాడు.
శీర్షికను చూడగానే కోపంతో తిట్టబుద్ధి అవుతుంది, చదివాక(నిందాస్తుతి) హృదయం ద్రవించి కళ్ళు చెమ్మగిల్లుతాయి.
బట్టలకొట్టులో నాకు పట్టుబట్టలు కొని
తనకు పడవని నూలుబట్టలు కొన్నప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

నాకు కొత్తచెప్పలుకొని నా పాతచెప్పులు
తను వేసుకుంటూ కొత్తచెప్పులు నన్ను
కొరుకుతాయన్నప్పుడు నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని

నాకు లడ్డులుకొనిచ్చి తను పిడికెడు
పప్పులు తింటూ తీపు నాకు పడదన్నప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

ఉన్న ఒక్క పరుపును నాకు పరిచి
నడుము నొప్పికి నేలపడకే మంచిదన్నప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

నన్ను ఆటో ఎక్కించి
షుగర్ కు నడక మంచిదని తను నడచినప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

నా ట్యూషన్ ఫీజ్ కోసం ఓవర్ టైం చేసి
లేట్ గావచ్చి స్నేహితులతో పిచ్చాపాటనప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

తిరునాళ్ళలో గుర్రం ఎక్కించమంటే కళ్ళు
తిరుగుతాయని తన భుజాలెక్కించుకున్నప్పుడు
నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

నాకు అన్నింటినీ ఇవ్వడానికి
నాన్న ఎన్నింటిని కోల్పోయాడో
నాన్న డైరీ చదివేదాకా నాకు తెలియలేదు
నాన్న అబద్ధమాడుతున్నాడని !

” అవును …నాన్న పచ్చి అబద్ధాలకోరు ”
నిజమేగా ! పిల్లల అవసరాలు తీర్చడం కోసం అలవోకగా ఎన్నో అబద్ధాలు పలికేస్తూ.
బిడ్డ పడి గాయమైతే అమ్మ ఏడ్చేస్తుంది. మరి నాన్న కన్నీళ్ళు కనపడవు,ఏమీ కాదంటూనే భయంతో కారే చెమటచుక్కల్లో దాచేస్తాడు. అమ్మ భూమిలా ఆధారమైతే , నాన్న పక్షుల్లా పారాడే పిల్లలకు తన దేహాన్నే గొడుగులా మారి రక్షించే నీలాకాశం.
పేదరికపు తండ్రి వుంటాడేమో, ప్రేమ లేని తండ్రి వుండడు. చరిత్రలో హుమాయూన్ పరాజితుడై అడవిపాలైనపుడు పుత్రుడు పుడితే సంతోషంలో కానుకలు ఇవ్వడానికి తన చేతిలో ఏమీ లేనపుడు,గంధపుచెక్కల ముక్కలను పంచి “సుగంధంలా నా కొడుకు పరిమళించేలా ఆశీర్వదించండి” అని అన్నారట. నాన్న ప్రేమకు ఎంతటి చక్కటి తార్కాణం.
కష్టంలో కన్నీరు తుడిచి, ఓడినపుడు భుజం తట్టి నేనూ లేనూ అంటూ భరోసా ఇచ్చే నేస్తమే నాన్న.
నేటి రోజుల్లో స్త్రీ, పురుషులు ఇరువురూ ఉద్యోగులు కావడం వలనైతేనేమి లేదూ అంటే ప్రేమను దాచుకోలేక పోవడం వలనైతేనేమి మగాళ్ళూ పిల్లల మలమూత్రాల విసర్జనలను శుభ్రం చేయడంలోనూ, సంరక్షణలోనూ స్త్రీలతో సమానంగా చేస్తున్నారు.హర్షించదగ్గ పరిణామం.
దారిన వెళ్ళే ప్రతీ స్త్రీని అమ్మాని పిలువచ్చు కానీ కన్నతండ్రని ఒక్కరినే “నాన్న” అని పిలుస్తారు.
అంతటి అద్భుతమైన ఏకైక పదమే నాన్న . నాన్న ఓ బ్రహ్మ జన్మకు కారణమవుతూ,నాన్న ఓ స్నేహితుడు చిన్ననాటి నుండి నీతో ఆడుకుంటూ,నాన్న ఓ నిచ్చెన ఎదుగుదలకు మెట్లు అవుతూ,నాన్న ఓ గురువు నిరంతరం జీవితపాఠాలు బోధిస్తూ, నాన్న ఓ మార్గదర్శకుడు బ్రతుకుకు బంగారు బాట చూపుతూ, నాన్న ఓ రక్షక కవచం నీ ఒంటిని కనురెప్పలా కాస్తూ, నాన్న ఓ అనురాగ సింధువు ఎన్నో స్వేదబిందులు చిందిస్తూ,నాన్న ప్రేమ పాలలో వెన్న
కడవరకూ తన కష్టాలను నీకు కనబడక దాచేస్తూ.

Leave A Reply

Your email address will not be published.

Breaking