మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి(ప్రజాబలం):
బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్న్ అవుట్ పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి అందించాలని అన్నారు. జిల్లాలో నూతనంగా నమోదైన ఓటర్లు, ముద్రించిన ఓటర్ గుర్తింపు కార్డులు, పంపిణీ చేసిన కార్డులపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా జనాభా ఓటర్ల నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్లలో యువ ఓటర్ల నిష్పత్తి పై సమాచారం అందించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర జనాభా, ఓటర్ నిష్పత్తి, లింగ నిష్పత్తి ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్ ఔట్ పెరిగే దిశగా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలలోకి ఎన్నికల కమిషన్ సందేశం విస్తృతంగా వెళ్ళే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వినూత్న ఆలోచనతో ఓటరు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. దీంతో పాటు ఆగస్టు 19న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం ఓటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఐ ఓట్ ఫర్ ష్యూర్ (I Vote for Sure) అనే నినాదానికి ప్రచారం కల్పిస్తూ 5 కే రన్ నిర్వహించాలని…5 కే రన్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అందులో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుండి నుంచి యువత వచ్చే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్ ఔట్ పెంచేందుకు అనుసరించే వ్యూహం, చేపట్టే కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థలలో ప్రత్యేక ఎలక్టోరల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని, ఓటరు ప్రాముఖ్యత పై విస్తృత ప్రచారం కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన ఓటరు నమోదు అంశంలో లింగ నిష్పత్తి తక్కువ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన మహిళా ఓటర్లు నమోదు విస్తృతంగా జరిగేలా చూడాలని అన్నారు. రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల కంటే ముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, రెండవ ఓటరు సవరణ షెడ్యూల్ పై సమాచారం అందించాలని, ఆగస్టు 21న విడుదల చేస్తామని, సెప్టెంబర్ 19 లోపు అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అధికారులు కి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎన్నికల సూపరింటెండెంట్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.