వ్యాసకర్త . ఎస్సీ హెచ్ రంగయ్య ,
అధ్యక్షులు – ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్.
హైదరాబాద్ ఫిబ్రవరి 17; పొదుపు అనే ఒక చిరు లక్షణం తొలుత చిన్నగా, సూక్ష్మంగా అనిపించ వచ్చేమో కానీ ఒక సమయం దాటిన తర్వాత అదిచ్చే ఫలితం అమోఘం, అది తీర్చిన అవసరం అనంతం కావచ్చు..! అలానే నేడు సమస్త అంగాలు చేవ చచ్చి అంపశయ్య పైన ఉన్న పర్యావరణానికి ఏ కొద్ది చికిత్స జరిగినా అది పెద్ద ఉపశమనమే అవుతుంది. భారీ చెట్టే నాటాల్సిన పనిలేదు బజారులో ఉన్న చెత్త బుట్టను పారదర్శకంగా ఉపయోగించినా కూడా పర్యావరణానికి మేలు చేసినట్టే అవుతుంది. ఈ వాస్తవాన్ని మరిచిన మానవ సమాజం పర్యావరణాన్ని అంటరానిదిగా వ్యవహరిస్తోంది. దాని ఫలితమే నేడు ఎదురవుతున్న అనేక ప్రకృతి విపత్తులు, వైపరిత్యాలు. ఈ ఉదాసీన పామరుడి నుంచి వచ్చింది అంటే కాసేపు నిట్టూర్చి వడిలేయోచ్చు. కానీ విజ్ఞత ఉన్న విద్యాధికులు కూడా అదే దారి ప్రయాణించడం అత్యంత బాధాకరం. వచ్చమా, పని చేశామా, వెళ్ళమా అని వృత్తి ధర్మాన్ని మాత్రమే కొనసాగిస్తున్న వారిలో చాలామంది వ్యక్తి ధర్మం పాటించడం లేదు. వ్యక్తి ధర్మం అనేదే సామాజిక చింతన. సమాజానికి మనవంతుగా ఏమి చేశామన్నదే వ్యక్తి ధర్మం చెప్పే సత్యం. ఆ ధర్మాన్ని మరిపించే స్వార్థ చింతన అనేక అనర్థాలకు కారణమవుతోంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అర్థం అవుతుంది. అన్నీ ఇస్తున్న ప్రకృతికి మనం తిరిగి ఇవ్వలేక పోతున్నామన్న వాస్తవం. మనం ఉన్నా , లేకున్నా మన వారసులను గుండెల్లో పెట్టుకొని కాపాడే ఒక సర్వ శక్తి ఈ ప్రకృతి. అమ్మ లాంటి ఈ ప్రకృతి ఇప్పుడు నిరంతరం క్షోభకు గురవుతోంది. అందుకు కారణం మానవ సమాజమే..! వయసు మీరిన పెద్దల వినికిడి లోపానికి కారణం ద్వని కాలుష్యమని తెలిసినా పట్టించుకోము, పసివాడి అనారోగ్య ఆహాకారాలకు కారణం ఫలానా అని తెలిసినా… పెదవి విప్పలేకపోతున్నాము, పిడికిలి భిగించలేకపోతున్నాము. వీటన్నిటికీ కారణం కరుడుగట్టిన ఉదాసీనత. 100 యేళ్లు బతకాల్సిన మనిషి అర్ధాంతరంగా హరీ మంటున్నా కారణాలు వెతక్క పోవడానికి కారణం కూడా ఈ ఉదాసీనతే. ఒకప్పుడు గొరంతలా ఉన్న మనిషి ఉదాసీనత నేడు కొండంతలా మారి ప్రకృతి వనరులను గొరంతలా మార్చి వేసింది. “తిని కూర్చుంటే”….అన్న సామెత ‘ఒక్క మానవుని ఉదాసీనతకు పెట్టు’ అనేలా సమాజ దృక్కోణం మారిపోయింది. ఇవాళ మనం హాయిగా, సకల సౌఖ్యాలతో ఎంజాయ్ చేశామన్నది ముఖ్యం కాదు. అదే ఎంజాయ్ రేపటి తరాలు చేయగలవా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవలసిందే.ఇప్పటికీ మించిపోయింది లేదు. మనిషి ఎదుగుదలకు , మనుగడకు అన్నీ ఇచ్చిన ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకొని వ్యక్తి ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు సాగే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఇంటి నుంచి బయటకే వెళ్లేపుడు విధిగా ఒక సంచి వెంట తీసుకుపోవడం , బజారులో చెత్త తగుల బెట్టడాన్ని ఆపడం, రోడ్ల ఆక్రమణ అడ్డుకోవడం, ప్లాస్టిక్ స్వయం నియంత్రణ…ఇలా ఏదైనా సరే మన వంతుగా, ఎంతో కొంత సేవగా వ్యక్తి ధర్మాన్నీ కొనసాగించవచ్చు. జనం-మనం.. రెండు వైపులా నడమంత్రం మేటలా పెరిగిపోయిన ఉదాసీనత కోట గోడలు కూల్చి వేయగలిగినపుడు పర్యావరణ అంతప్పుర గోడలు ఆకాశమంత ఎత్తులో ఎదిగి తరాలను సుభిక్షం చేయగలవు. రేపటి తరాల కళ్యాణం కోసం దశాబ్దాలుగా పేరుకుపోయిన ఉదాసీనత నుంచి మనందరం బయట పడలేమా..!? నిజమైన మానవ ధర్మాన్ని నిర్వర్తించలేమా!
వ్యాసకర్త . ఎస్సీ హెచ్ రంగయ్య ,
అధ్యక్షులు – ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్.