స్పందించని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిగ్గుపడాలి !!
— అందోల్ బీఎస్పీ ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం
సంగారెడ్డి జూన్ 16 ప్రజ బలం ప్రతినిది వట్ పల్లి: బాసర ఐఐఐటి లో మృతి చెందిన వడ్ల దీపిక మృతిపై సీబీఐతో విచారణ జరిపించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థుల మృతికి కారణమైనటువంటి త్రిబుల్ ఐటీ సిబ్బందిపై హాత్యానేరం కేసు నమోదు చేయాలని బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం డిమాండ్ చేశారు.
వట్టిపల్లి మండలం గోర్రేకల్ గ్రామనివాసి అయిన వడ్ల వీరన్న కుమార్తె వడ్ల దీపిక (17) బాసర ఐఐఐటిలో చదువుతూ మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, నేడు దీపిక తండ్రి వీరన్న కుటుంబాన్ని డా.ముప్పారం ప్రకాశం పరామర్శించడం జరిగినది. వీరన్నతో మాట్లాడి దీపిక మృతికి సంబంధించిన అనేక వివరాలను సేకరించడం జరిగినది.
ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ బాసర ఐఐఐటి లో చదువుకోవడానికి పోయినటువంటి బహుజన పిల్లలు పిట్టల్లా ఒరిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుమాలిన చర్య అని, స్థానిక నాయకుడిని అని చెప్పుకునే అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందోల్ నియోజకవర్గంలోని ఆడబిడ్డ చనిపోతే నేటికి కూడా స్పందించకపోవడం సిగ్గుమాలిన చర్య అని, స్థానిక ప్రజలు కష్టాల్లో ఉంటే సంబరాల్లో మునిగి తేలడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యార్థినిలు విద్యాసంస్థలలో రక్షణ లేకుండా అవస్థలు పడుతూ హత్యలకు గురైతుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఏమాత్రం స్పందించకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనమని, చేతగానప్పుడు తక్షణం విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రకాశం డిమాండ్ చేశారు.
బహుజన పిల్లలు పిట్టల నేలకొరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుండా తన చేతగానితనాన్ని బహిర్గతం చేస్తున్నాడని, ఈ రాష్ట్రాన్ని ఏలే అర్హత కేసిఆర్ గారికి లేదని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమి చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన దీపిక కుటుంబానికి తక్షణం 50 లక్షల ఎక్స్గ్రేషియే, దీపిక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని , డబుల్ బెడ్ రూం ఇల్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో అందోల్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఫోన్ ద్వారా వీరన్న తో మాట్లాడి ధైర్యం చెప్పి, దీపిక మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మృతి చెందిన దీపిక తండ్రి వీరన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు సమస్య చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, తనకొచ్చిన కష్టం ఇతర విద్యార్థిని కుటుంబాలకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి వట్టిపల్లి మండల అధ్యక్షులు కిరణ్, చౌటకూర్ మండల అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, నాయకులు ముప్పారం పద్మారావు సంజీవ్, షడ్రక్, ఎలీషా, శేఖర్, బిబిపేట్ రాజు, పల్లె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.