కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : మెడికల్ క్యాంపులో నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు పెంచిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేసారు. ఖమ్మం మంచికంటి హల్ లో CPM పార్టీ టూ టౌన్ కమిటీ, మరియు బోడేపూడి విజ్ఞాన కేంద్రం ( బివికే) ఆధ్వర్యంలో నెల నెలా మెడికల్ క్యాంపులో భాగంగా శనివారం వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తంగా 850 రకాల మందుల ధరలను భారీగా పెంచేందుకు తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం వేసిందని తెలిపారు. రోగులు వాడే మందులపై 2019లో 2 శాతం, 2020లో 0.5శాతం మాత్రమే ధరలు పెంచుకోవడానికి అవకాశమిచ్చిన కేంద్రం… ఏప్రిల్‌ ఒకటి నుంచి మామూలు జ్వరానికి వాడే మందు బిళ్లలతోపాటు, బీపీ, షుగర్‌, గుండెజబ్బులు తదితర జబ్బులకు వాడే మందులతోపాటు, 850 రకాల మందులపై 11శాతానికి ధరలు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు ఇది సరైందికాదని తెలిపారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నూనెలు, విద్యుత్‌ బిల్లులతోపాటు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. దీనికితోడు ప్రస్తుతం మందుల ధరలు కూడా పెంచడమంటే ప్రజలపై మరింత భారం వేయడమేనని గుర్తు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు, ప్రభుత్వాల ఆదాయం పడిపోయినప్పటికీ కార్పొరేట్‌ మందుల కంపెనీలు, ఆస్పత్రుల యజమానులు మాత్రం కుబేరులయ్యారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బీపీ, షుగర్‌, గుండెజబ్బులు తదితర మందులు రెగ్యులర్‌గా వాడే పేదలు వైద్యానికి దూరమవుతారనీ, తక్షణమే వాటి ధరల పెంపుదల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టరు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, బివికే మేనేజర్ వై శ్రీనివాసరావు, ప్రముఖ డాక్టర్లు సి భారవి, కొల్లి అనుదీప్, రావిళ్ళ రంజిత్, పిల్లలమర్రి సుబ్బారావు, జెట్ల రంగారావు , పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, శివనారయణ, వాసిరెడ్డి వీరభద్రం, అఫ్జల్, పి.వాసు, కాంపాటి వెంకన్న, జె వెంకన్న బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking