ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజాబలం) చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిధాయకమని బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళ్లు అర్పిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ, పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను చాకలి ఐలమ్మ గడగడలాడించిందని తెలిపారు. ఆమె జయంతి సందర్భంగా ఆమె సేవలను నామ స్మరించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిందని పేర్కొన్నారు. హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాటం, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర రైతాంగ పోరాటంలో కీలకమై, బహుజనులకు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె నాయకత్వంలో భూమి కోసం సాగిన పోరాటం తెలంగాణలో ప్రజలకు స్ఫూర్తిని అందించిందని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యం నేటి సమాజానికి ఎంతో ప్రభావవంతమై ఉందని, నేటి తరానికి ఆమె ఆత్మగౌరవ పోరాటం ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఆమె జీవితం, సేవలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయని స్పష్టం చేశారు