కందాళ తీరు మార్చుకో

కమ్యూనిస్టులను విమర్శిస్తే మూల్యం చెల్లించక తప్పదు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) ఖమ్మం పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి తన తీరు మార్చుకోవాలని తన పదవి కాంక్ష కోసం పార్టీని సైతం తప్పుదారి పట్టిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. పూటకొక మాట మాట్లాడే ఉపేందర్రెడ్డికి కమ్యూనిస్టులను విమర్శించే అర్హత లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లతో గెలిచి కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని వ్యాఖ్యనించడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సామెతను గుర్తుకు తీసుకు వస్తుందన్నారు. కమ్యూనిస్టుల పట్ల ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదని గతంలో పలుమార్లు ఇదే వైఖరిని అవలంభించారని ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో బిజెపి ముప్పును గ్రహించి విశాల ప్రతిపాదికన లౌకిక శక్తులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలు ప్రయాణం చేయాలని భావిస్తున్నాయని ఇటువంటి. తరుణంలో మతోన్మాద వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కందాళ వ్యాఖ్యలు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. మునుగోడు ఫలితం తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచనలకు భిన్నంగా కందాళ వ్యాఖ్యనిస్తున్నారని ప్రసాద్ తెలిపారు. స్వార్ధం కోసం, పదవుల కోసం పార్టీలు మార్చిన కందాళ కమ్యూనిస్టులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో కమ్యూనిస్టుల అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం మూలంగానే దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చరిల్లుతున్నాయని, ఆర్థిక దోపిడీ. జరుగుతుందన్న భావన ప్రస్తుతం నెలకొందన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల గురించి, కమ్యూనిస్టుల శక్తి గురించి కాంట్రాక్టర్ కందాళ ఏమి తెలుసునని ప్రసాద్ ప్రశ్నించారు. ఇక ముందు కమ్యూనిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులకు ఓట్లు వేయరన్న మాటలను ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking