అయితే 25 శాతం సరిపోదు 50 శాతంకు పెంచాలి
రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్ మార్చ్ 2 ():రాష్ట్రంలోని ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టళ్ళ, గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలను 25 శాతం పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం పట్ల హర్షం రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య వ్యక్తం చేసారు. ముఖ్య మంత్రి కెసిఆర్ – ఆర్ధికమంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ గత 6 సంవత్సరాల కాలంలో పెరిగిన ధరల కనుగుణంగా ఈ మెస్ ఛార్జీలు పెంపుదలలేదన్నారు. గత 6సంవత్సరాల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు 100 శాతం నుంచి 200 శాతంకు పెరిగాయి. 2017లో ధరలు కిలో కందిపప్పు రూ.60 రూపాయలు ఉంటే నేడు రూ.130 రూపాయలకు పెరిగింది. అలాగే కిలో మంచి నూనె రూ.55 ఉండేది నేడు రూ.170 రూపాయలకు పెరిగింది. గ్యాస్ ధర రూ.400 నుండి రూ.1200 కు పెరిగింది. ఇలా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కావున మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు 25 శాతం సరిపోదు. దీనిని కనీసం 50 శాతంకు పెంచడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ తీసుకోని గతంలో పెంచిన మాదిరిగా పెరిగిన ధరల కనుగుణంగా పెంచాలని విజ్నప్తి చేస్తున్నాం. గతంలో 2017లో మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిపర్సుల కంటే ముఖ్యమంత్రి ఎక్కువ చేసి పెంచారు. ఇప్పుడు కూడా పెంచాలని కోరారు.హోటల్ లో ఒక పూట భోజనం 80 రూపాయలు ఉంది. కాని హాస్టల్ విద్యార్థులకు పూటకు 10 రూ. లకు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇప్పుడు పెంచిన దానిలో రూ.10 నుంచి రూ.13 కు పెరుగుతుంది. ఇది ఆచరణలో పెద్దగా ఉపయోగపడదు. భావి భారత పౌరులకు, కాబోయే డాక్టర్లకు, ఇంజినీర్లకు, శాస్త్రవేత్తలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు పూటకు 13రూ. ల నాసిరకం భోజనం పెడితే భావి భారత పౌరులు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. ఎదిగే-చదివే వయస్సులో నాసిరకం ఆహారం పెడితే జ్ఞాన సమాజం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు.రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒకదానికి కూడా సొంత భవనాలు లేవు. కేటాయించిన ప్రభుత్వ స్థలాలను కూడా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అధికారులు లంచాలు తిని దారదత్తం చేస్తున్నారు. దొరల కార్లు వెళ్లడానికి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకా పేట్ లో ఫ్లై ఓవర్లు, స్కై ఓవర్స్ ను వేలకోట్ల రూపాయలతో వెచ్చించి కడుతున్నారు. కానీ చదువుకొని భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ లు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కావల సిన విద్యార్థులను బందెల దొడ్డిలో పశువులను తొలినట్లు ఒక్కొక్క రూంలో 20 నుంచి 50 మందిని వుంచుతున్నారు. భవిష్యత్ దిబ్బ తిస్తున్నారు.చదువు దెబ్బ తింటుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇదేం న్యాయం? బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తారా? అని ప్రశ్నించారు.ఇంజనీరింగ్ / మెడిసిన్ / యం.బి.ఎ./ యం.సి.ఎ./ పి.జి./ డిగ్రీ తదితర కోర్సుల ఫీజులను ఎంత ఉంటే అంత మొత్తం ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజలు ప్రభుత్వం భరించేది. కాని 2014 ప్రభుత్వం పూర్తి ఫీజుల స్కీముకు గండి కొట్టి GO జారీచేశారు. పెంచిన ఫీజులు కట్టలేక బి.సి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజినీరింగ్ లో 35 వేల కంటే ఎక్కువ యున్న ఫీజులను కట్టే ఆర్థికస్తోమత లేక, అప్పులు పుట్టక వేలాది మంది బి.సి. విద్యార్థులు చదువు మానుకుంటున్నారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నారు. మైనార్టీ ముస్లింలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ జి.ఓ. జారీచేశారు. కాని బి.సి.లు ఉద్యమాలు చేస్తుంటే కూడా బి.సి. విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయడానికి GO జారీ చేయడం లేదు. పూర్తి ఫీజులు మంజూరు చేస్తే అధనంగా 150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు రాదు. ఇతర కులాలకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ కేవలం బి.సి. విద్యార్థులకు మంజూరు చేయకపోవడం అన్యాయం కదా! బి.సి. లు చేసిన పాపం ఏమిటి? బి.సి.లలో పుట్టడమే పాపమా! బి.సి.లు పన్నులు కట్టడంలేదా! దేశ సంపద సృష్టించడం లేదా! ఎందుకింత బి.సి.ల పట్ల చిన్న చూపని ద్వజమెత్తారు.ఈ సమావేశం లో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ సత్యం, లాల్ కృష్ణ, గొరిగే మల్లేష్, అంజి, కోలా జనార్ధన్, రఘుపతి, సి.రాజేందర్, దివ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.