రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి జూలై 18 (ప్రజాబలం) ఖమ్మం రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రి వర్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రఘునాధపాలెం మండలం వి. వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్ బ్యాక్ స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపు 2 లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, రెండవ విడతలో లక్షన్నర వరకు, మూడవ విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పథకం వర్తింపజేస్తామని, రేషన్ కార్డు రుణమాఫీ పథకానికి ప్రామాణికం కాదని, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ ను అసలు వడ్డీ కలిపి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో వి. వెంకటాయపాలెం రైతు సీతారాం తో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎంత రుణం తీసుకున్నది, పిల్లలు, ఎం చదువుతున్నది, రుణమాఫీ ఎలా అనిపిస్తుంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం నష్టం వచ్చినట్లు, రుణమాఫీ తో తిరిగి వ్యవసాయం చేయడానికి అవకాశం కల్గినట్లు తెలిపారు. తనలాంటి యువరైతులు వ్యవసాయం వైపు మల్లేలా రుణమాఫీ సహకరిస్తున్నదని తెలిపారు.

రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం వి. వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డిసిసిబి చైర్మన్ వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, విద్యుత్ శాఖ ఎస్ఇ సురేందర్, ఉద్యానవన శాఖ అధికారి వెంకట రమణ, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking