ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముందుకొచ్చిన సంస్థలకు ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.
సింగపూర్‌తో పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్‌ వేదికగా పెట్టుబడులకు సంబంధించి కుదిరిన ఒప్పందాలపై ముఖ్యమంత్రి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి తో దావోస్‌ పర్యటనలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ధనసరి సీతక్క , పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి మాట్లాడారు.
ఓపెన్‌ యాక్సెస్‌ విధానంతో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఎనర్జీ పాలసీతో పెట్టబడులను ఆకర్షించగలిగాం. డేటా సెంటర్లకు సంబంధించిన వాటిల్లోనే లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయి.
సాధారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల పెట్టుబడులతో ముందుకొచ్చారు. దాదాపు 1 లక్షా 80 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది.
పజా ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల కాలంలో ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ఈ పెట్టుబడుల సాధన విజయమే అత్యంత కీలకమైంది. కొందరు తెలంగాణ ప్రభుత్వం మీద, హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారు. తద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని, రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలను కుట్రలు పన్నారు. ఆయా కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ప్రకటించడంతో వారి కుట్రలు విఫలమయ్యాయి.
పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన చోట భూ కేటాయింపులు గానీ, పరిపాలన అనుమతులు ఇవ్వడం ద్వారా గానీ ఆ సంస్థలను ప్రోత్సహిస్తాం. ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే కాలంలో తెలంగాణ సమాజానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందివ్వాలన్న ఆలోచన ప్రభుత్వానిది.
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి. వన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీకి తీసుకెళ్లాలని నిరంతరం కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.
దావోస్‌ పర్యటనే కాకుండా సింగపూర్‌ ప్రభుత్వంతో కూడా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌లో ఒప్పందం చేసుకున్నాం. అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.
అమెజాన్‌, సన్‌ పెట్రోకెమికల్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌ సీఎల్‌… ఇలా అనేక ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటే కొందరు లేకితనంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయా కంపెనీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు.
తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నప్పుడు స్వాగతించడానికి ఇష్టం లేనివారు మౌనంగా ఉండండి. ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామో జాబితా, ఫోటోలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయి. అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌ జబ్బుతో బాధపడుతున్న వారు చెబుతున్నది నిజమా. ప్రభుత్వం చెబుతున్నది నిజమా పరిశీలించుకోవచ్చు.
కీలకమైన ఈ నిర్ణయాలను యువతకు ముఖ్యంగా ప్రజలకు చేరవేయాల్సిన, చేరవేస్తున్న మీడియాకు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking