రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..భారీ వర్షాలు,పెండింగ్ ధరణి, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు,కొత్త రెవెన్యూ చట్టం వంటి అంశాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ,రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం గురించి కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల వలన పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రహదారులపై వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు, విద్యాసంస్థలకు ఎలాంటి సమస్యలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాజెక్టులు,నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యవసర బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పెండింగ్ లో ఉన్న ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాల వారీగా పెండింగ్ లో ధరణి,ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి,ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తిరస్కరించినట్లైతే కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సంబంధిత సిబ్బంది ద్వారా ప్రత్యేక బృందాలను నియమించాలని, దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన రెవెన్యూ యాక్ట్ పై జిల్లా స్థాయిలలో మేధావులు,సీనియర్ సిటిజన్స్, సీనియర్ అధికారులతో వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు.
ఖమ్మం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెండింగ్ లో ఉన్న ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.కొత్త రెవెన్యూ చట్టం పై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ లు నిర్వహించాలని తెలిపారు.అనంతరం జిల్లాల వారీగా మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం పై ఈ నెల 23న వర్క్ షాప్ లను నిర్వహించి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి,కోమల్ రెడ్డి, ముఖ్య ప్రణాళికా అధికారి బాబురావు, అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking