శ్రీ కృష్ణ జన్మాష్టమి వేషధారణ లో చిన్నారులు

 

ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి,నిజాంపేట్

24 ఆగస్టు 2024:

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల రిషి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చిన్నారులతో కలిపి జరిపారు ఈ సందర్భంగా స్కూల్ యజమాన్యం మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా.. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరు బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణుడి గురించి.. కృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
కన్నయ్య జన్మ రహస్యం..

భాగవతం ప్రకారం.. పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు.
విష్ణుమూర్తి ప్రత్యక్షమై..

అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్లు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి.. ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు.
గోకులాష్టమి..

ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగ బిడ్డ పుట్టాలి. ఆడపిల్ల పుట్టిందని.. తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగ మాయగా మారి.. కంసుడికి దొరక్కుండా పైకి ఎగసి ‘‘నిన్ను చంపేవాడు పుట్టాడు.. రేపల్లెలో పెరుగుతున్నాడు’’ అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఏ భాస్కర్ రెడ్డి, కరస్పాండెంట్ బి. స్వామి, స్కూల్ టీచర్స్, ఏ సంధ్య,బి స్వప్న, ఎం భాగ్యలక్ష్మి, యు, స్వప్న.ఏ రజిత, టీ. లావణ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking