జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వచ్చేవరకు పోరు ఆగదు

 

హౌసింగ్ కమిటీ నిర్లక్ష్య ధోరణి మారాలి

ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు సూచన

డైరెక్టర్ల ఇంటిని ముట్టడించి నిరసన తెలిపిన జర్నలిస్టులు

ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్

వారం రోజుల్లోగా హౌసింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని అల్టిమేటం

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజాబలం) ఖమ్మం 400 మంది జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు గత రెండు దశాబ్దాలు గా జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని, వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా హౌసింగ్ కమిటీలోని కొందరు సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మారాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు హెచ్చరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇళ్లస్థలాల ప్రక్రియ రోజు రోజుకు తీవ్ర జాప్యం కావడం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిటీలో ఇష్టం లేనివారు తక్షణమే తప్పుకోవాలని, కమిటీలో ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కాలయాపన చేస్తూ గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు హౌసింగ్ కమిటీ మార్పు అనివార్యమైతే ఆ దిశగా నూతన కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కమిటీలో మార్పులు చేర్పులు అవసరమైతే అదనంగా మరి కొంతమంది సభ్యులను కమిటీలోకి చేర్చుకోవాలని సూచించారు. కమిటీలో కొందరు వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చి సమన్వయ లోపం తో సమావేశాల నిర్వహణకు కాలయాపన జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారానికి స్వస్తి పలకాలని కోరారు. జర్నలిస్టుల ఆకాంక్ష నెరవేరేవరకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ఇళ్ల స్థలాలు సాధించేవరకు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లోగా తక్షణమే హౌసింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని లేనిపక్షంలో ప్రెస్ క్లబ్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని అందుకు హౌసింగ్ కమిటీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

       

డైరెక్టర్ల ఇంటి ఎదుట గాంధీ గిరి తరహా జర్నలిస్టుల నిరసన

ఇళ్ల స్థలాల ప్రక్రియలో హౌసింగ్ కమిటీ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఖమ్మం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు హౌసింగ్ కమిటీ డైరెక్టర్ల ఇంటి ఎదుట మొదటి విడతలో గాంధీ గిరి తరహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హౌసింగ్ కమిటీ డైరెక్టర్లు సివిఆర్ శ్రీనివాస్ కు గులాబీ పువ్వులు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. మరో డైరెక్టర్ మాటేటి వేణు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ కు జర్నలిస్టులు వెళ్లగా ఆ సమయంలో వేణు లేకపోవడంతో అతను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ గేటు వద్ద రోజా పూలతో నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకూ తమ వంతు కృషి చేయాలని డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సమావేశం జరుగుతుండగా హౌసింగ్ కమిటీ అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఖదీర్, డైరెక్టర్ కనకం సైదులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబుకు ఫోన్ చేసి జరిగిన పరిణామాలపై జర్నలిస్టుల సమక్షంలో లౌడ్ స్పీకర్ ద్వారా వివరణ ఇచ్చారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రామిశెట్టి విజేత, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, కెరటం నాగయ్య, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, మహిళా జర్నలిస్ట్ లు ఈశ్వరి, శ్రీదేవి, జర్నలిస్ట్ నేతలు పానకాలరావు, వెంకటకృష్ణ, తిరుపతిరావు, గోవింద్, నరేంద్ర, పులి శ్రీను, శ్రీను రమేష్, హుస్సేన్, వెంకటాద్రి, ప్రభాకర్ రెడ్డి, ఇస్సాంపల్లి వెంకటేశ్వర్లు, మురళి, నల్లమోతు శ్రీను, ఖాసిం, ఉపేందర్, వేణుగోపాల్, వెంకట్, గణేష్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking