సీఎం ఇతర మంత్రులు స్పందించాలి

 

రేవా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతి

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 08 (ప్రజాబలం)
ఖమ్మం సుమారు 30 లేదా 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి అన్ని వర్గాల ప్రజలకు తమ వంతు సహకారం అందించిన తమకు ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా) ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. రిటైర్డ్ అయి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల తమ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, విద్య, ఈఎంఐ, ఆసుపత్రి ఖర్చులు తదితర సమస్యలతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక వారి వేదింపులు తట్టుకోలేక మనోవేదన గురవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమవి గొంతెమ్మ కోరికలు కావని ఆర్థిక సమస్యలు జీవన్మరణ సమస్యగా మారాయన్నారు. జిపిఎఫ్, ఈ ఎల్ తదితర ఆరు రకాలుగా బకాయిలు ఉన్నాయని అందులో రెండు రకాల మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని మిగిలిన నాలుగు రకాలు తమ వేతనంలో నుంచి కట్ చేసుకుని ఉద్యోగ విరమణ పొందిన తర్వాత అందజేస్తారని తెలియజేశారు. తమ వద్ద కట్ చేసిన సొమ్మును కూడా ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు. అనారోగ్యం మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13000 మంది ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేసిన వారున్నారు. పెన్షన్ బకాయిలను నెలకు 1000 కోట్ల చొప్పున విడుదల చేయాలని వారు వేడుకుంటున్నారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిలపై తమ ఆవేదనను వ్యక్తం చేసామని వారు తెలిపారు.
ప్రెస్ క్లబ్ సమావేశంలో 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా) అధ్యక్షుడు సింగారపు జయరాం, ప్రధాన కార్యదర్శి మువ్వల భారతి, రామారావు, లక్ష్మయ్య, నాగేందర్, రామకోటేశ్వరరావు, గోవిందరావు, కృష్ణారావు అంబటి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking