నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బోనకల్ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.

రైతులకు అండగా ఉంటాం
‘గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి.

దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది.

జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. యావరేజ్‌గా 16 శాతం వరకు ఉంది. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు.

రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking